Asianet News TeluguAsianet News Telugu

పారాహుషార్... చైనా నుంచి భారత్‌లోకి మరో వైరస్: ఐసీఎంఆర్ హెచ్చరిక

కరోనాకు పుట్టినిల్లయిన చైనా నుంచి భారత్‌కు మరో ముప్పు పొంచి ఉందనే అంచనాలు మరింత ఆందోళన పుట్టిస్తున్నాయి. చైనాతో పాటు, వియత్నాంలో అనేకమందికి సోకిన 'క్యాట్ క్యూ వైరస్' (సీక్యూవీ) మనదేశంలోనూ వ్యాప్తి చెందే అవకాశం ఉందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) హెచ్చరించింది.

ICMR warns of another Chinese virus which could spread disease in india
Author
New Delhi, First Published Sep 29, 2020, 2:47 PM IST

కరోనాకు పుట్టినిల్లయిన చైనా నుంచి భారత్‌కు మరో ముప్పు పొంచి ఉందనే అంచనాలు మరింత ఆందోళన పుట్టిస్తున్నాయి. చైనాతో పాటు, వియత్నాంలో అనేకమందికి సోకిన 'క్యాట్ క్యూ వైరస్' (సీక్యూవీ) మనదేశంలోనూ వ్యాప్తి చెందే అవకాశం ఉందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) హెచ్చరించింది.

క్యూలెక్స్ జాతి దోమలు, పందులను ఈ వైరస్ వాహకాలుగా మార్చుకుంటుందని చైనా, తైవాన్ శాస్త్రవేత్తల అధ్యయనంలో ఇప్పటికే వెల్లడైందనీ, భారత్‌లోనూ ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఐసీఎంఆర్ పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఐసీఎంఆర్ అధ్యయనం ప్రకారం, ఆర్థ్రోపోడ్-బోర్న్ వైరస్లలో ఒకటి (ఆర్బోవైరస్), సీక్యూవీ మానవులలో జ్వరం, మెనింజైటిస్ , చిన్న పిల్లలో మెదడు వాపు లాంటి వ్యాధులకు కారణం కావచ్చు.

ప్రధానంగా దోమలు సీక్యూవికి గురయ్యే అవకాశం ఉంది. వాటి ద్వారా ప్రజలకు సోకే అవకాశం ఉంది. ఐసీఎంఆర్, పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ అఫ్ వైరాలజీ శాస్త్రవేత్తలు దేశవ్యాప్తంగా సుమారు 883 హ్యూమన్ సీరం శాంపిల్స్ పరీక్షించగా ఆయా వ్యక్తుల్లో సీక్యూవి యాంటీ బాడీస్ ఉన్నాయి కానీ వైరస్ లక్షణాలు లేనట్లు నిర్ధారించారు.

అయితే కొంతమంది వ్యాధికి గురయ్యే ఉంటారని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. దీంతో మరికొందరి శాంపిల్స్ కూడా పరీక్షించాల్సిన అవసరం ఉందని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. 2014, 2017 సంవత్సరాల్లో కర్ణాటకకు చెందిన రెండు శాంపిల్స్‌లో ఈ వ్యాధికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యాయి.

ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐజెఎంఆర్) తాజా సంచికలో ఈ అధ్యయన ఫలితాలు ప్రచురితమయ్యాయి. ఈ అధ్యయన సమయంలో, మానవులు లేదా జంతువుల నమూనాలలో వైరస్ ను గుర్తించలేదు.

దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24 గంటలలో అత్యధికంగా రికార్డ్ స్థాయిలో 70,589 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య  61 లక్షల 45 వేలకు చేరింది.

గడచిన 24 గంటలలో దేశంలో కరోనా కారణంగా మొత్తం 776  మంది మృతి చెందగా.. దేశ వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకుని 84,877 డిశ్ఛార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 96,318 మృతి చెందగా.. మొత్తం డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 51,01,397కి పెరిగింది.

దేశ వ్యాప్తంగా  9,47,576యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కరోనా రోగుల రికవరీ రేటు 83.01 శాతంగా నమోదైంది.  ప్రస్తుతం యాక్టివ్ కేసుల శాతం 15.42  శాతంగా ఉంది. దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటలలో 11,42,811 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు చేసిన పరీక్షల సంఖ్య  7,31,10,041.

Follow Us:
Download App:
  • android
  • ios