Asianet News TeluguAsianet News Telugu

భారత్‌లో ఇప్పటి వరకు 32 కోట్ల మందికి కోవిడ్.. ఒకరిని గుర్తించేలోపే 27 మందికి: ఐసీఎంఆర్ సర్వే

దేశంలో కోవిడ్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు 24.1 శాతం మంది ప్రజలు వైరస్ బారినపడినట్లు భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) వెల్లడించింది. ఈ మేరకు తాజాగా జరిపిన సెరో సర్వే ఫలితాలను సంస్థ తెలిపింది.

icmr sero survey 24 percent population exposed to virus ksp
Author
New Delhi, First Published May 23, 2021, 10:13 PM IST

ఒక్క కరోనా వైరస్ కేసు గుర్తిస్తే 27 మందికి వైరస్‌ సోకినట్లే అని పేర్కొంది. దేశంలో పదేళ్లు పైబడిన ప్రతి నలుగురిలో కోవిడ్ బాధితులేనని ఐసీఎంఆర్‌ స్పష్టం చేసింది. అయితే, కేంద్రం ప్రకటించిన గణాంకాలకు ఐసీఎంఆర్‌ లెక్కలకు వ్యత్యాసం కనిపిస్తోంది. దేశంలో కేవలం రెండు శాతం మందికే కరోనా సోకిందని కేంద్ర ఆరోగ్యశాఖ ఇటీవల వెల్లడించింది.

2020 డిసెంబర్‌ - 2021 జనవరి మధ్య కాలంలో ఐసీఎంఆర్‌ ఈ సెరో సర్వే జరిపింది. ఆరోగ్య కార్యకర్తలు సహా దేశంలో పదేళ్లు పైబడిన ప్రతి నలుగురిలో ఒకరు కోవిడ్‌తో ప్రభావితమయ్యారని తెలిపింది. ఆరోగ్య సిబ్బందిలో 25.6 శాతం మంది కరోనా బారినపడగా.. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువ మంది కోవిడ్ బాధితులు ఉన్నట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. 

సెరో సర్వేలో సాధారణ పౌరుల రక్త నమూనాలను సేకరించి వారిలో igG యాంటీబాడీలు ఉన్నాయో? లేదో అని పరీక్షిస్తారు. ఫలితం పాజిటివ్‌ వస్తే ఆ వ్యక్తి అప్పటికే వైరస్‌ బారినపడినట్లు పరిగణిస్తారు. దేశంలో వైరస్‌ వ్యాప్తి మొదలైన తర్వాత తొలిసారి 2020 మే - జూన్‌లో ఐసీఎంఆర్‌ సెరో సర్వే నిర్వహించింది. అప్పుడు దేశ జనాభాలో కేవలం 0.73శాతం మందిలోనే యాంటీబాడీలు ఉన్నట్లు గుర్తించింది.

Also Read:ఇండియాలో తగ్గుతున్న కరోనా కేసులు, మరణాలు

2020 ఆగస్టు-సెప్టెంబర్‌లో రెండోసారి సెరో సర్వే నిర్వహించినప్పుడు ఆ సంఖ్య 7.1శాతానికి పెరిగింది. తాజాగా ఇది 24.1 శాతానికి చేరడం గమనార్హం. దేశంలోని 21 రాష్ట్రాల్లో ఎంపిక చేసిన 70 జిల్లాల్లో ఈ సర్వే నిర్వహించారు. పదేళ్లు పైబడినవారిలో కనీసం 400 మంది నమూనాలను, ఆరోగ్య సిబ్బందిలో 100 మంది శాంపిళ్లను సేకరించారు. మొత్తం 28 వేల 589 మంది సాధారణ పౌరులు, 7 వేల 171 మంది ఆరోగ్య కార్యకర్తలు ఈ సర్వేలో పాల్గొన్నారు. దీని ప్రకారం దేశంలో పావు వంతు జనాభా కోవిడ్ బారినపడ్డారు. అంటే అక్షరాలా 32 కోట్ల మంది.

పట్టణ ప్రాంతాల్లో వైరస్ సంక్రమణ 26.2 శాతంగా ఉంటే..గ్రామీణ ప్రాంతాల్లో 19.1 శాతంగా ఉంది. వైద్యులు, నర్శులు, ఫీల్డ్‌స్టాఫ్, పారామెడికల్ స్టాఫ్ మధ్య పెద్దగా గణాంకాల్లో వ్యత్యాసం లేనప్పటికీ.. వైద్యులు, నర్సులలో సంక్రమణ శాతం 26.6 శాతమైతే..పరిపాలనా సిబ్బందిలో 24.9శాతంగా ఉంది. ఇది కూడా కేవలం ఈ ఏడాది ప్రారంభంలో మాత్రమేనని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. అదే సర్వేను మార్చ్- ఏప్రిల్ నెలల్లో చేపట్టి వుంటే పరిస్ధితి ఎలా వుండేదో అర్ధం చేసుకోవచ్చు. అంటే దేశ జనాభాలో దాదాపు 40-45 కోట్లమందికి కరోనా సోకి ఉండవచ్చని అంచనా.

ఈ సర్వేపై ప్రముఖ వైద్యులు డాక్డర్‌ సునీల్‌ గార్గ్‌ స్పందించారు. దీని ప్రకారం, 24.1శాతం కాకుండా మిగతా వారికి వైరస్‌ సోకే ముప్పు ఉందని హెచ్చరించారు. వైరస్‌ ఉద్ధృతికి గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది బాధితులుగా మారారని.. కొందరిలో యాంటీబాడీలు కూడా తయారయ్యాయని వివరించారు. దీనివ్ల దేశంలో మరో సెరో సర్వే నిర్వహిస్తే మంచిదని సునీల్ గార్గ్ సూచించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios