దేశంలో కోవిడ్ సెకండ్‌ వేవ్‌ విశ్వరూపంతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించుకున్నా దాదాపు రాష్ట్రాలన్నీ ఆంక్షలు, లాక్‌డౌన్ బాటపట్టాయి. ఒక్కో రాష్ట్రం ఒక్కో విధమైన ఆంక్షలతో కరోనా కట్టడికి చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటికే దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ ఆంక్షలు అమలు చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్ సంచలన వ్యాఖ్యలు చేసింది. కరోనా పాజిటివిటీ 10 శాతం మించిన జిల్లాల్లో 6 నుంచి 8 వారాల పాటు లాక్‌డౌన్‌ తప్పనిసరని సూచించింది. వైరస్‌ విజృంభణ కొనసాగుతున్న వేళ.. మహమ్మారి కట్టడికి ఎన్ని రోజులు లాక్‌డౌన్‌ అవసరమనే అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో ఐసీఎంఆర్‌ చీఫ్‌ బలరాం భార్గవ ఈ సూచనలు చేశారు.

అధిక పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాల్లో పూర్తి లాక్‌డౌన్‌ ఉండాల్సిందేనని బలరాం భార్గవ అన్నారు. అక్కడ పాజిటివిటీ రేటు 10 నుంచి 5 శాతానికి తగ్గితే ఆంక్షలు సడలించవచ్చని ఆయన చెప్పారు. అలా జరగాలంటే 6 నుంచి 8 వారాల లాక్‌డౌన్‌ అవసరమని భార్గవ స్పష్టం చేశారు.

Also Read:‘ఇండియన్ వేరియంట్’ విషయంలో మేము అలా చెప్పలేదు.. డబ్ల్యూహెచ్ఓ

ఈ సందర్భంగా ఢిల్లీ లాక్‌డౌన్‌ను బలరాం భార్గవ ప్రస్తావించారు. అక్కడ 35 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు లాక్‌డౌన్ అమలు చేయడం వల్ల ప్రస్తుతం అది 17 శాతానికి తగ్గిందని.. ఇలాంటి పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ను సడలిస్తే పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 

కాగా, దేశవ్యాప్తంగా కరోనా పాజిటివిటీ రేటు సరాసరి 21 శాతం ఉన్నట్లు ఐసీఎంఆర్‌ వెల్లడించింది. దేశంలోని 718 జిల్లాల్లో దాదాపు 310 జిల్లాల్లో దేశ పాజిటివిటీ రేటు సరాసరి (21%) కంటే ఎక్కువగా ఉండగా.. మూడో వంతు జిల్లాల్లో పది శాతం కంటే ఎక్కువ పాజిటివిటీ రేటు ఉందని తెలిపింది.

దేశంలో కరోనా పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో గోవా తొలి స్థానంలో ఉండగా... పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్‌, హరియాణా, కర్ణాటక ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.