కరోనా పరీక్షలకు రెండు రోజులు ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ వాడొద్దు: ఐసీఎంఆర్ కీలక సూచన
రెండు రోజుల పాటు అన్ని రాష్ట్రాలు ర్యాపిడ్ టెస్టు కిట్స్ ఉపయోగించకూడదని కేంద్రం మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేసింది.
న్యూఢిల్లీ: రెండు రోజుల పాటు అన్ని రాష్ట్రాలు ర్యాపిడ్ టెస్టు కిట్స్ ఉపయోగించకూడదని కేంద్రం మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేసింది.
మంగళవారం నాడు ఐసీఎంఆర్ డిప్యూటీ డైరెక్టర్ రామన్ గంగాఖేద్కర్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ ను నిర్ధారించే పరీక్షల కోసం ర్యాపిట్ టెస్ట్ కిట్స్ ను ఉపయోగిస్తున్నారు. అయితే ర్యాపిడ్ టెస్టు కిట్స్ వల్ల సరైన ఫలితాలు రావడం లేదని రాజస్థాన్ కేంద్రానికి ఫిర్యాదు చేసింది.
also read:లాక్‌డౌన్: 21 రోజుల్లో 25 అడుగుల బావిని తవ్విన దంపతులు
ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ ద్వారా పరీక్షలు చేయడాన్ని ఆ రాష్ట్రం నిలిపివేసింది. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాలు ర్యాపిట్ టెస్ట్ కిట్స్ ను దిగుమతి చేసుకొని కరోనా టెస్టులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
క్షేత్రస్థాయిలో ఐసీఎంఆర్ సిబ్బంది ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ లో పరీక్షలు నిర్వహించిన తర్వాతే ఈ విషయమై ఓ నిర్ణయాన్ని ప్రకటించనున్నట్టుగా ఐసీఎంఆర్ డిప్యూటీ డైరెక్టర్ రామన్ ప్రకటించారు.
ఇప్పటివరకు దేశంలోని సుమారు 4 లక్షలకు పైగా మందికి కరోనా టెస్టులు నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రెండు రోజుల తర్వాత కొత్త మార్గదర్శకాలను వెల్లడిస్తామని ఆయన తేల్చి చెప్పారు.కేంద్రం నుండి కొత్త మార్గదర్శకాలు వచ్చే వరకు ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ ను ఉపయోగించకూడదని ఆయన అన్ని రాష్ట్రాలను కోరారు.