ఐసిఐసిఐ బ్యాంక్‌కు కొత్త చైర్మన్ దొరికారు!

ICICI Bank Appoints GC Chaturvedi As New Chairman
Highlights

దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థ అయిన ఐసిఐసిఐ బ్యాంక్‌కు కొత్త నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా మాజీ ఐఏఎస్‌ అధికారి గిరీష్‌ చంద్ర చతుర్వేది భాద్యతలు స్వీకరించనున్నారు.

దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థ అయిన ఐసిఐసిఐ బ్యాంక్‌కు కొత్త నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా మాజీ ఐఏఎస్‌ అధికారి గిరీష్‌ చంద్ర చతుర్వేది భాద్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఈ బ్యాంక్‌కు చైర్మన్‌‌గా కొనసాగుతున్న ఎంకె శర్మ స్థానాన్ని 65 ఏళ్ల చతుర్వేది భర్తీ చేయనున్నారు. శర్మ పదవీకాలం జూన్ 30వ తేదీతో ముగుస్తుంది.

ఐసిఐసిఐ బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా చతుర్వేది నియామకం జూలై 1, 2018వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ సందర్భంగా చతుర్వేది మాట్లాడుతూ.. కొత్త బాధ్యతలు చేపట్టేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, బ్యాంక్‌ చైర్మన్‌గా తన ప్రాధాన్యతలు లేదా కార్యచరణ ప్రణాళిక గురించి ఇప్పుడే స్పందించలేనని అన్నారు. ప్రస్తుతం ఐసిఐసిఐ బ్యాంక్‌ పరిస్థితి గందరగోళంగా ఏం లేదని, ఈ మధ్య తలెత్తిన ఇబ్బందులను అధిగమించి బ్యాంక్‌ మళ్లీ ముందుకు సాగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

వీడియోకాన్‌ రుణ వివాదం కేసులో ఐసిఐసిఐ బ్యాంకు సీఎండీ చందా కొచ్చర్ ఆరోపణలు ఎదుర్కుంటున్న సంగతి తెలిసిందే. ఈ విచారణ పూర్తయ్యేంతవరకు నిరవధిక సెలవులో వెళ్లాల్సిందిగా బ్యాంక్ బోర్డు ఆమెకు సూచించింది.

ఎవరీ గిరీష్‌ చంద్ర చతుర్వేది ?

గిరీష్‌ చంద్ర చతుర్వేది ఉత్తరప్రదేశ్‌ క్యాడర్‌కు చెందిన 1977వ సంవత్సరం బ్యాచ్‌ ఐఎఎస్‌ అధికారి. ఈయన గడచిన 2013 జనవరిలో చమురు శాఖ కార్యదర్శిగా పదవీవిరమణ పొందారు. అంతకుముందు ఆయన ఆర్థిక సేవల విభాగంలోని బ్యాంకింగ్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌ సెక్టార్‌ అడ్మినిస్ట్రేటివ్‌ డిపార్ట్‌మెంట్‌లోనూ ఐదేళ్లపాటు కీలక బాధ్యతలు నిర్వహించారు. చతుర్వేది గతంలో ఐడిబిఐ బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బిఒబి) బోర్డుల్లో ప్రభుత్వ నామినీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈయన బ్రిటన్‌లోని లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో ఎమ్ఎస్‌సి, యూనివర్సిటీ ఆఫ్‌ ఆక్స్‌ఫర్డ్‌ నుంచి డాక్టరేట్‌ పట్టాను కూడా పొందారు.

loader