బీజేపీ నేత, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బు సుందర్ తన తండ్రి గురించి షాకింగ్ కామెంట్లు చేసింది. బాల్యంలో తండ్రి తనను లైంగికంగా వేధించాడనే విషయాన్ని ఆమె తెలిపింది. తాజాగా, ఆ వ్యాఖ్యలు చేసినందుకు బాధపడటం లేదని, తప్పు చేసినవాడే సిగ్గుపడాలని, తానెందుకు సిగ్గుపడాలి అని ప్రశ్నించింది. 

హైదరాబాద్: బీజేపీ నేత, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ సుందర్ ఇటీవలే తన తండ్రి గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనమైన సంగతి తెలిసిందే. బాల్యంలో తండ్రి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె వెల్లడించడం దుమారం రేపింది. ఈ వ్యాఖ్యలపై ఆమె తాజాగా స్పందిస్తూ.. ఆ వ్యాఖ్యలు వెల్లడించడంలో తప్పేమీ లేదని అన్నారు. తప్ప చేసినవాడు సిగ్గుపడాలని, తాను సిగ్గుపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తాను నిజాయితీగా వీటిని వెల్లడించానని చెప్పారు.

‘నేనేమీ అందరూ ఆశ్చర్యపరిచే వ్యాఖ్యలు చేయలేదు. నిజానికి అది నా నిజాయితీ. వెల్లడించిన విషయాలపట్ల నేను సిగ్గుపడట్లేదు. ఎందుకంటే అది నాకు జరిగిన ఘటన. కాబట్టి, తప్పుచేసిన వాడే సిగ్గుపడాలని నేను భావిస్తాను.’ అని బీజేపీ నేత ఖుష్బు సుందర్ ఏఎన్ఐతో మాట్లాడుతూ వివరించారు. 

Also Read: ఫ్లోరిడాలో రెండు విమానాలు ఢీ.. ఒకరు మృతి

అంతేకాదు, మహిళలు తాము ఎదుర్కొన్న అఘాయిత్యాల గురించి నోరు విప్పాలని తాను కోరుకుంటున్నానని అని అన్నారు. ‘మహిళలు శక్తిమంతంగా ఉండాలని, తమను తామే నియంత్రించుకోవాలని, వేరేవరో వారిని అణగదొక్కాలని చూస్తే సహించవద్దనే సందేశాన్ని పంపించాలని నేను అనుకుంటున్నాను. నేను ఎదుర్కొన్న ఘటన గురించి మాట్లాడటానికి చాలా సంవత్సరాలు తీసుకన్నాను. మహిళలు వారు ఎదుర్కొన్న అఘాయిత్యాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉన్నదని భావిస్తున్నాను. ఏది ఏమైనా నేను నా ప్రయాణాన్ని సాగిస్తాను’ అని తెలిపారు.

బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ఖుష్బూ సుందర్‌ను జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఇటీవలే నామినేట్ చేశారు. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ అధికారికంగా నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఆమె మూడేళ్లు జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా కొనసాగుతారు.

ఖుష్బూ సుందర్ ఓ ఇంటర్వ్యూలో తాను బాల్యంలో తండ్రి నుంచి ఎదుర్కొన్న వేధింపుల గురించి మాట్లాడారు. చిన్న పిల్లలు ఇలాంటి వేధింపులకు గురైనప్పుడు.. అవి జీవితాంతం వారిని వెంటాడుతాయని అన్నారు. జీవితాంతం ఒక మచ్చగా అవి మిగిలిపోతాయని వివరించారు. 8 ఏళ్ల వయసులో తాను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్టు వెల్లడించారు. అదీ తన తండ్రే తనను వేధించారని చెప్పారు. 15 ఏళ్ల వయసులో అతడిని నిలదీసే ధైర్యం వచ్చిందని అన్నారు. తన 16వ యేటా తండ్రి తమను వదిలిపెట్టి వెళ్లిపోయాడని పేర్కొన్నారు. అయితే, తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి తల్లికిి కూడా చెప్పలేదని అన్నారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు పెద్దపెట్టన దుమారం రేపాయి.