నేను మహారాష్ట్ర సీఎం కావాలనుకుంటున్నా..: కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే అభిలాష
మహారాష్ట్ర సీఎం రేసులోకి కొత్తగా కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే కూడా దూకారు. తాను కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్టు ఆయన సాంగ్లిలో విలేకరులకు చెప్పారు. సుశీల్ కుమార్ షిండే తర్వాత మహారాష్ట్రకు దళిత ముఖ్యమంత్రి లేరని వివరించారు.
ముంబయి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైనే ఉన్నా.. దాని కంటే ముందు సీఎం రేసు మొదలైనట్టు అనిపిస్తున్నది. ఎన్నికల కంటే కూడా ఇప్పుడు రాజకీయ నేతలు సీఎం ఆశావాహులపై మాట్లాడుతున్నారు. నిన్నా మొన్నటి దాకా ఎన్సీపీ లీడర్ అజిత్ పవార్ ఈ విషయంపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. తాజాగా కేంద్రమంత్రి రామ్‌దాస్ అథవాలే మహారాష్ట్ర సీఎం సీటు గురించి మాట్లాడారు. తాను కూడా మహారాష్ట్ర సీఎం కావాలనే ఆసక్తిని వెల్లించారు.
కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి రామ్‌దాస్ అథవాలే కూడా ఇప్పుడు మహారాష్ట్ర సీఎం రేసులోకి దూకారు. మహారాష్ట్ర తదుపరి సీఎం కావాలని అభిలాషిస్తున్నట్టు తెలిపారు. అంతేకాదు, నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్‌లోకి చేరాలని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌కు ఆహ్వానం పలికారు.
మహారాష్ట్రలోని సాంగ్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రామ్‌దాస్ అథవాలే మాట్లాడారు. నేడు మహారాష్ట్ర సీఎం కుర్చీపై ప్రతి ఒక్కరూ కన్నేశారని అన్నారు. ఎవరు ఎన్ని మాట్లాడినా మెజారిటీ ఉన్నవారికే ఆ సీటు దక్కుతుందని వివరించారు. దీనిపై చాలా చర్చ జరుగుతున్నందున తాను కూడా తన అభిలాషను వెల్లడించాలని అనుకుంటున్నట్టు తెలిపారు. తాను కూడా మహారాష్ట్రీ సీఎం కావాలని కోరుకుంటున్నట్టు వివరించారు.
సుశీల్ కుమార్ షిండే తర్వాత దళిత ముఖ్యమంత్రి ఎవరూ మహారాష్ట్రకు లేరని ఆయన తెలిపారు. అలాంటి కోణంలో ఏవైనా ఆలోచనలు ఉంటే తాను తప్పకుండా ముఖ్యమంత్రి కావడానికి ఆసక్తి చూపుతానని వివరించారు. కానీ, ప్రస్తుత ప్రభుత్వం ఏక్‌నాథ్ షిండే నాయకత్వంలో సుస్థిరంగా సాగుతున్నదని తెలిపారు. ఆయన రోజుకు 16 నుంచి 18 గంటలు పని చేస్తారని, ఆయన సమర్థవంతమైన ముఖ్యమంత్రి అని వివరించారు.
Also Read: డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై 2 ఎఫ్ఐఆర్‌లు.. సుప్రీంకోర్టు జోక్యం తర్వాత నమోదు
శరద్ పవార్ మాకు రాజకీయాలు నేర్పాడని, అలాంటి అనుభవశీలురు ఎన్డీఏలోకి రావాలని అథవాలే అన్నారు. విభిన్న భావజాలాలు గల జార్జి ఫెర్నాండేజ్, నితీష్ కుమార్ వంటి వారు ఎన్డీఏలోకి వచ్చారని వివరించారు. కాబట్టి, తన ప్రతిపాదనను శరద్ పవార పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.