డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై 2 ఎఫ్ఐఆర్‌లు.. సుప్రీంకోర్టు జోక్యం తర్వాత నమోదు
డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. కన్నాట్ ప్లేస్ పోలీసు స్టేషన్‌లో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై రెండు కేసులు నమోదయ్యాయి. ఏడుగురు రెజ్లర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. న్యాయ స్థానం వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.
న్యూఢిల్లీ: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. దేశంలోనే టాప్ రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై తమ ఫిర్యాదులతో పోలీసులు కేసులు నమోదు చేయడం లేదని ఆరోపిస్తూ ఏడుగురు మహిళా రెజ్లర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఇవి తీవ్రమైన ఆరోపణలు అని తెలిపింది. సుప్రీంకోర్టు జోక్యం అనంతరం, ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు.
కన్నాట్ ప్లేస్ పోలీసు స్టేషన్‌లో ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. ఓ మైనర్ బాధితురాలు చేసిన లైంగిక ఆరోపణల ఆధారంగా పోక్సో సహా ఇతర ఐపీసీ సెక్షన్ల కింద ఒక కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడికి బెయిల్ లభించదు. ఇతర రెజ్లర్లు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా మరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు.
డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై లైంగిక ఆరోపణలు చేస్తూ.. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టాప్ రెజ్లర్లు వినేశ్ ఫోగట్, బజ్రంగ్పూనియా, సాక్షి మాలిక్ వంటి వారు జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. అయితే, సుప్రీంకోర్టు జోక్యంతో రెండు ఎఫఐఆర్‌లు నమోదైనా వారు తమ ధర్నా విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు.
Also Read: బీబీసీ చైర్మన్ రిచర్డ్ షార్ప్ రాజీనామా.. నియామకానికి ముందు బోరిస్ జాన్సన్‌కు రుణమిప్పించడంలో సాయం!
పోలీసు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చినా వారు ధర్నా విరమించబోమని, డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ తక్షణమే అరెస్టు చేసే వరకూ తాము ధర్నా కొనసాగిస్తామని వివరించారు. ‘మేం సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తాం. కానీ, మాకు ఢిల్లీ పోలీసుల మీద నమ్మకం లేదు. ఈ పోరాటం ఎఫ్ఐఆర్‌లు నమోదు చేయడం కోసం కాదు. అలాంటి వ్యక్తులను శిక్షించడానికే ఈ పోరాటం. ఆయన ఊచల వెనక్కి వెళ్లాల్సి ఉన్నది. ఆయనను పదవి నుంచి తొలగించాలి’ అని రెజ్లర్లు తెలిపారు.