భారత వైమానిక స్ధావరాలపై పాకిస్తాన్ దాడిని తిప్పికొట్టడంలో దురదృష్టవశాత్తూ పాక్ భూభాగంలోకి ప్రవేశించి.. అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించిన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ తిరిగి విధుల్లో చేరునున్నారు.

విమానం కూలిపోతున్న సమయంలో పారాచూట్ సాయంతో అభినందన్ కిందకు దూకిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయన విధుల్లో చేరడానికి గల పూర్తి సామర్ధ్యాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

దీంతో ఆయనకు బెంగళూరులోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసన్ నుంచి అనుమతి లభించాల్సి వుంది. నిబంధనల ప్రకారం గాయపడ్డ తరువాత 12 వారాల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి.

మే చివరి నాటికి ఈ గడువు ముగియనుంది. అనంతరం పరీక్షలు నిర్వహించి యుద్ధ విమానాలు నడిపే సామర్ధ్యం ఉందో, లేదో ధ్రువీకరించనున్నారు. ప్రస్తుం వర్ధమాన్.. తన భార్యాపిల్లలతో కలిసి శ్రీనగర్‌లోని ఎయిర్‌ఫోర్స్ నెం.51 స్క్వాడ్రన్‌కు చేరుకున్నారు.