బాలాసాహెబ్ ఠాక్రే సిద్ధాంతానికి తాను ద్రోహం చేయబోనని మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే అన్నారు. తన ఆలోచన ఎప్పుడూ హిందుత్వంపైనే అని చెప్పారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ట్వీట్ చేశారు.
మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే మహారాష్ట్ర ప్రజలకు సోషల్ మీడియా ద్వారా గురి పూర్ణిమ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ లో బాలాసాహెబ్ ఠాక్రే ఫొటో ను షేర్ చేశారు. అందులో ‘‘ బాలాసాహెబ్ భావజాలానికి, సిద్ధాంతానికి ద్రోహం చేయను. ఆ మంట ఆరిపోదు.. హిందుత్వం లేని ఆలోచన లేదు. గురు పూర్ణిమ సందర్భంగా శుభాకాంక్షలు ’’ అని పేర్కొన్నాడు.
మహారాష్ట్రలో భారీ వర్షాలు.. కొండచరియలు విరిగిపడి ఒకరు మృతి.. 89కి పెరిగిన మరణాలు
సాధారణంగా గురు పూర్ణిమను హిందువులు, జైనులు బౌద్ధులు మతస్తులు జరుపుకుంటారు. తమ జీవితాలను జ్ఞానోదయం వైపు నడిపించే గురువులను గౌరవించటానికి, గుర్తు చేసుకునేందుకు నిర్వహించుకుంటారు. అయితే ఏక్ నాథ్ షిండే తన గురువు బాలా సాహెబ్ అని తరచూ చెబుతుంటారు. ఈ నేపథ్యంలోనే గురు పూర్ణిమ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
శివసేనలో తిరుగుబాటుకు నాయకత్వం వహించిన షిండే జూన్ 30వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. గత నెలలో మహారాష్ట్ర రాజకీయాలు ఒక్క సారిగా మారిపోయాయి. అంత వరకు సంకీర్ణంగా ఉన్న ఎంవీఏ ప్రభుత్వం (శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ) ఒక్క సారిగా కుప్పకూలింది. దీంతో సీఎం పదవికి శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే రాజీనామ చేయాల్సి వచ్చింది.
ప్రస్తుతం ఏక్ నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్ లు మాత్రమే కేబినేట్ సభ్యులుగా ఉన్నారు. అయితే జూలై 18న జరగనున్న మహారాష్ట్ర బీజేపీ అధ్యక్ష ఎన్నికల తర్వాత అందరూ ఎదురు చూస్తున్న మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది. షిండే, ఫడ్నవీస్ గత వారం న్యూఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. ఈ పర్యటనలో మహారాష్ట్రలో మంత్రివర్గ విస్తరణపై చర్చలు జరిగినట్టు తెలుస్తోంది.
Hijab row: హిజాబ్ వివాదం.. కర్నాటక హైకోర్టు తీర్పు వ్యతిరేక పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ
కాగా ఉద్దవ్ ఠాక్రే వర్గం ఏకనాథ్ షిండే నేతృత్వంలోని 16 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసింది. అయితే మహారాష్ట్ర అసెంబ్లీలో పార్టీ శాసనసభా విభాగానికి చెందిన మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ మంది శాసనసభ్యుల మద్దతు ఉన్న కారణంగా తమదే అసలైన శివసేన అని షిండే పేర్కొన్నారు. దీంతో పాటు దాదాపు 14 మంది లోక్‌సభ సభ్యులు షిండే నేతృత్వంలోని వర్గంలో చేరే అవకాశం కనిపిస్తోంది. దీంతో పార్లమెంటరీ పార్టీలో చీలిక కూడా జరిగే అవకాశం ఉంది. షిండే శివసేన ఆధీనంలో ఉన్న పౌర సంస్థలు, మునిసిపల్ కార్పొరేషన్లను కూడా తన వైపే లాగేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవలే థానేకు చెందిన 66 మంది శివసేన కార్పొరేటర్లు సీఎం ఏక్ నాథ్ షిండే వర్గంలో చేరారు. మరి కొన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా కార్పొరేటర్లను తమలో కలుపుకోవాని షిండే భావిస్తున్నారు.
