తనని జైలుకు పంపించినా, తన ఆస్తులను సీజ్ చేసినా, తనని కాల్చినా కూడా ఎవరికి భయపడబోనని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. కేంద్రంలో బీజేపీ దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మ‌హారాష్ట్రలోని శివ‌సేన ఎంపీ సంజయ్ రౌత్‌కు చెందిన ఆస్తులను మంగళవారం అటాచ్ చేసింది. దీంతో ఆయ‌న కేంద్ర ప్ర‌భుత్వంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేంద్రం ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను దుర్వినియోగం చేస్తుంద‌ని ఆరోపించారు. తాను ఎవరికీ భయపడనని, నిజమే గెలుస్తుందని అన్నారు. 

‘‘ నా ఆస్తిని స్వాధీనం చేసుకోండి. నన్ను కాల్చండి లేదా నన్ను జైలుకు పంపండి.నేను భయపడే వాడిని కాదు. సంజయ్ రౌత్ బాలాసాహెబ్ ఠాక్రే అనుచరుడు, శివసైనికుడు. అతడు పోరాడి అందరినీ బయటపెడతాడు. నిశ్శబ్దంగా ఉండండి. వారిని డ్యాన్స్ చేయనివ్వండి. నిజం గెలుస్తుంది ” అని సంజయ్ రౌత్ మీడియాతో అన్నారు. 

“ఆస్తి అంటే ఏమిటి ? నేను ఏమైనా విజయ్ మాల్యా, మెహుల్ చోక్సీ, నీరవ్ మోడీనా లేదా అంబానీ-అదానీనా? నేను ఒక చిన్న ఇంట్లో ఉంటున్నాను. అలీబాగ్‌లో నా స్వస్థలం ఒక్క ఎకరం కూడా కాదు. ఇది మనీలాండరింగ్ అని కేంద్ర ఏజెన్సీలు పేర్కొంటున్నాయి. ఎలాంటి లాండరింగ్? ప్రతీకార రాజకీయాల ఆధారంగా వారు ఇలా చేయకూడదు ’’ అని సంజయ్ రౌత్ అన్నారు.

మంగళవారం తెల్లవారు జామున మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద సంజయ్ రౌత్ మరియు అతని కుటుంబానికి సంబంధించిన అలీబాగ్‌లోని ఆస్తుల‌తో పాటు ముంబ‌యిలోని దాదర్ శివారులోని ఒక ఫ్లాట్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అటాచ్ చేసింది. ఏజెన్సీ.. భూ కుంభకోణం కు సంబంధించి ప్లాంట్ల లావాదేవీల‌ను స్తంభింపజేయడానికి మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎమ్‌ఎల్‌ఎ) కింద తాత్కాలిక అటాచ్‌మెంట్ జారీ చేసిందని అధికారులు తెలిపారు. ఈ మ‌నీలాండ‌రింగ్ కేసు ముంబై లోని ప‌త్రా చాల్ రీ-డెవలప్‌మెంట్‌కు సంబంధించిన రూ. 1,034 కోట్ల విలువైన భూ స్కామ్ తో ముడిపడి ఉంది.

అయితే ఈడీ చర్యను ఎన్సీపీ తీవ్రంగా ఆక్షేపించింది. మహారాష్ట్రలోని MVA కూట‌మిలో ఉన్న నాయ‌కుల గొంతును అణిచివేసేందుకు, ప్రతీకార రాజకీయాల కోసం బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని NCP ఆరోపించింది.

‘‘ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన రాజకీయ ప్రత్యర్థుల గొంతు నొక్కడానికి దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోంది. (మహారాష్ట్రలో) ఏమి జరుగుతోంది? ఇదీ మహారాష్ట్రలో జరుగుతున్న ప్రతీకార రాజకీయం ’’ అని మహారాష్ట్ర ఎన్సీపీ ప్రధాన అధికార ప్రతినిధి మహేష్ తపసే అన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింద‌ని, కానీ ప్ర‌భుత్వంగా ఏర్ప‌డిన మహా వికాస్ అఘాడీ నేతలను బీజేపీ టార్గెట్ చేస్తోందని ఆరోపించారు. 

కాగా 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మహారాష్ట్రలో ఏ పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ రాలేదు. సీఎం ప‌ద‌వి విష‌యంలో మిత్ర‌ప‌క్షాలుగా ఉన్న బీజేపీ, శివ‌సేన దూరమ‌య్యాయి. అనంత‌రం శివ‌సేన‌, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు ఎంవీఏ (మహా వికాస్ అఘాడి) కూటమిగా ఏర్పడి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వంలో ఈ మూడు పార్టీల భాగ‌స్వామ్యం ఉంది. ఈ మూడు పార్టీల నుంచి మంత్రులు ఉన్నారు.