తనకు 75 ఏళ్లు, 85 ఏళ్లు వచ్చినా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటానని మాజీ కేంద్ర మంత్రి ఉమాభారతి అన్నారు. బీజేపీ సీనియర్ నేత అయిన ఆమె.. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని చెప్పారు. తాను రాజకీయాల్లో నుంచి తప్పుకోలేదని స్పష్టం చేశారు.

తనకు రాజకీయాలు అంటే చాలా ఇష్టం అని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు ఉమాభారతి అన్నారు. తాను రాజకీయాల నుంచి తప్పుకోలేదని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్ లోని బుందేల్ ఖండ్ ప్రాంతంలోని సాగర్ జిల్లాలో సోమవారం జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. తాను చాలాకాలంగా పని చేస్తున్నందున ఐదేళ్ల విరామం మాత్రమే తీసుకున్నానని అన్నారు. 

‘‘నేను చాలా కాలంగా పనిచేస్తూనే ఉన్నాను. అందుకే గతసారి ఎన్నికల్లో పోటీ చేయడానికి నిరాకరించాను. ఐదేళ్లు విరామం తీసుకోవాలని అనుకున్నా. తాను రాజకీయాల నుంచి తప్పుకున్నానని అందరూ అనుకుంటున్నారు. కానీ నేను రాజకీయాల నుంచి తప్పుకోలేదు’’ అని అన్నారు. తనకు 75 ఏళ్లు వచ్చినా, 85 ఏళ్లు వచ్చినా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని చెప్పారు. తనకు రాజకీయాలు అంటే చాలా ఇష్టం అని అన్నారు. 

Scroll to load tweet…

రాజకీయాలను విలాస వనరుగా కొందరు భావించారని, వారే రాజకీయాలను నాశనం చేశారని ఉమాభారతి అన్నారు. మధ్యప్రదేశ్ లో ఈ ఏడాది నవంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా.. చివరిసారిగా 2014లో ఆమె ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ నుంచి లోక్ సభకు పోటీ చేసి విజయం సాధించారు. 

అనంతరం కేంద్రంలోని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ మొదటి దఫా ప్రభుత్వంలో కేంద్ర మంత్రి అయ్యారు. అయితే గత ఎన్నికల్లో ఆమె పోటీ చేయలేదు. కాగా.. సెప్టెంబర్ 3న పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంభించిన బీజేపీ 'జన ఆశీర్వాద్ యాత్ర'కు ఆమెకు ఆహ్వానం అందలేదు. దీంతో ఉమాభారతి అసంతృప్తి వ్యక్తం చేశారు.