నేనే గ్యాస్ డబ్బాలు పట్టుకున్నా - లోక్ సభలో దాడిపై కాంగ్రెస్ నాయకుడి సంచలన వ్యాఖ్యలు
లోక్ సభలో జరిగిన భద్రతా ఉల్లంఘన ఘటనపై ఒక్కో విషయం బయటకు వస్తోంది. ఈ ఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న కాంగ్రెస్ ఎంపీ గుర్జీత్ సింగ్ ఔజ్లా.. ఓ దుండగుడి చేతిలో ఉన్న డబ్బాను లాక్కున్నారు. ఈ విషయాన్ని ఆయన మీడియాతో వెల్లడించారు.
శీతాకాల సమావేశాలు జరుగుతున్న క్రమంలో లోక్ సభలో భారీ భద్రతా ఉల్లంఘన జరిగింది. ఇద్దరు వ్యక్తులు సందర్శకుల గ్యాలరీ నుంచి చేతిలో రెండు డబ్బాలతో సభలోకి దూకారు. అందులో నుంచి పసుపు రంగు పొగలు వెలువడటంతో ఎంపీలందరూ భయంతో బయటకు పరుగులు తీశారు. దీంతో పార్లమెంట్ ఆవరణలో తీవ్ర గందరగోళం నెలకొంది.
ఈ ఘటన సమయంలో అక్కడే ఉన్న కాంగ్రెస్ నాయకుడు కార్తీ చిదంబరం పలు విషయాలను వెల్లడించారు. ఆ యువకులిద్దరూ నినాదాలు చేస్తూ స్పీకర్ కుర్చీ వైపు పరిగెత్తేందుకు ప్రయత్నించారని ఆయన ‘ఎన్డీటీవీ’తో చెప్పారు. ‘‘అకస్మాత్తుగా 20 ఏళ్ల వయసున్న ఇద్దరు యువకులు సందర్శకుల గ్యాలరీ నుంచి సభలోకి దూకారు. వారి చేతిలో డబ్బాలు ఉన్నాయి. వాటి నుంచి పసుపు రంగు పొగ బయటకు వస్తోంది. వారిలో ఒకరు స్పీకర్ కుర్చీ వైపు పరుగెత్తేందుకు ప్రయత్నించారు. కొన్ని నినాదాలు చేశారు. ఆ పొగ విషపూరితమైనది కావచ్చు. ముఖ్యంగా 2001లో పార్లమెంటుపై దాడి జరిగిన డిసెంబర్ 13వ తేదీన మళ్లీ ఇది జరగడం తీవ్రమైన భద్రతా ఉల్లంఘన’’ అని అన్నారు.
కాగా.. లోక్ సభలో జీరో అవర్ కొనసాగుతున్న సమయంలో ఆకస్మాత్తుగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో సభ్యులందరూ సభ నుంచి బయటకు పరుగులు తీశారు. మరి కొందరు ఇద్దరు దుండగుల వైపు పరిగెత్తి వారిని పట్టుకున్నారు. అలా పట్టుకున్న వారిలో ఒకరైన కాంగ్రెస్ ఎంపీ గుర్జీత్ సింగ్ ఔజ్లా ‘ఎన్డీటీవీ’తో మాట్లాడుతూ.. ‘‘వారిలో ఒకరి చేతిలో పసుపు రంగు పొగ బయటకు వచ్చే డబ్బా కనిపించింది. దీంతో నేను దానిని లాక్కుని బయటకు విసిరేశాను. ఇది పెద్ద భద్రతా ఉల్లంఘన’’ అని చెప్పారు.
అలాగే.. ఆ దుండగులు ఇద్దరినీ ఎంపీలు చుట్టుముట్టి పట్టుకున్నారని, ఆ తర్వాత భద్రతా సిబ్బంది బయటకు తీసుకొచ్చారని కాంగ్రెస్ సభ్యుడు అధిర్ రంజన్ చౌదరి తెలిపారు. ‘‘దీంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. ఇది ఖచ్చితంగా భద్రతా ఉల్లంఘన. ఎందుకంటే ఈ రోజు 2001 (పార్లమెంటు దాడి) లో ప్రాణత్యాగం చేసిన వ్యక్తుల వర్ధంతిని జరుపుకున్నాము’’ అని ఆయన అన్నారు.
పాత పార్లమెంటు భవనంపై ఉగ్రదాడి జరిగి నేటిగి సరిగ్గా 22 ఏళ్లు పూర్తవుతోంది. మళ్లీ అదే రోజు ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. వాస్తవానికి ఈ ఘటన జరగానికి కొన్ని కొన్ని ముందు ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గత దాడి సమయంలో పార్లమెంట్ లో మరణించిన వారికి నివాళి అర్పించారు. దాడి సమయంలో వారెవరూ సభలో లేరు.