రాజ్యసభ టికెట్ కోసం ఆశావహులు విశ్వప్రయత్నాలు చేస్తున్న సమయంలో కర్ణాటక బీజేపీ ఉపాధ్యక్షుడు నిర్మల్ కుమార్ సురానా షాకిచ్చారు. తనకు టికెట్ వద్దని పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ  నడ్డాకు లేఖ రాశారు. 

త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు (rajya sabha election) సంబంధించి దేశంలోని అన్ని పార్టీలు తమ తమ అభ్యర్ధులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంకొందరు ఆశావహులు చివరి నిమిషం వరకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎలాగైనా టికెట్ దక్కించుకుని పెద్దల సభలో అడుగుపెట్టాలని చాలా మంది ఆశపడుతున్నారు. ఈ క్రమంలో తనకు రాజ్యసభ టికెట్ వద్దంటున్నారో బీజేపీ నేత (bjp) . వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలో (karnataka) శాసనసభ్యుల కోటా నుంచి రాజ్యసభ స్థానానికి దాదాపు పేరు ఖరారవుతుందని భావిస్తున్న తరుణంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిర్మల్‌కుమార్‌ సురానా (nirmal kumar surana) షాకిచ్చారు. 

మరో రెండురోజుల్లో నామినేషన్‌ దాఖలుకు గడువు సమీపిస్తున్న వేళ ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు (jp nadda) లేఖ రాశారు. తనకు రాజ్యసభ టికెట్‌ వద్దంటూ తేల్చిచెప్పారు. జూన్‌ 10న జరిగే రాజ్యసభ ఎన్నికల కోసం రాష్ట్ర బీజేపీ కోర్‌కమిటీ నిర్మల్‌ కుమార్‌ సురానా పేరును అధిష్టానం పరిశీలనలకు పంపింది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ (nirmala sitharaman) పేరు కూడా లిస్ట్‌లో ఉన్న విషయం తెలిసిందే. 

ఈసారి నిర్మలా సీతారామన్‌ కర్ణాటక నుంచి కాకుండా ఉత్తరప్రదేశ్‌ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం సాగుతున్న తరుణంలో సురానాకు టికెట్‌ ఖరారైనట్లేనని అందరూ భావించారు. కానీ సురానా స్వయంగా టికెట్‌ వద్దని, ప్రస్తుతం ఉన్న బాధ్యతలకు అదనంగా న్యాయం చేయలేనంటూ నడ్డాకు లేఖ రాయడం కన్నడ రాజకీయాలలో సంచలనంగా మారింది. సోమవారం నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో ఏ క్షణంలోనైనా తుది జాబితా ఖరారయ్యే అవకాశం ఉంది.

కాగా.. 15 రాష్ట్రాల సభ్యుల పదవీ విరమణ కారణంగా ఖాళీ అయిన 57 రాజ్యసభ స్థానాలకు జూన్ 10న ఎన్నికలు జరగనున్నాయి. సభ్యులు జూన్ 21, ఆగస్టు 1వ తేదీ మధ్య వేర్వేరు తేదీల్లో స‌భ్యులు పదవీ విరమణ చేస్తున్నారు. ఈ ఏడాది ఉత్తరప్రదేశ్‌లో పదకొండు సీట్లు ఖాళీ కానుండగా, మహారాష్ట్ర, తమిళనాడుల్లో ఆరుగురు సభ్యుల చొప్పున పదవీ విరమణ చేయనున్నారు. ఐదుగురు రాజ్యసభ ఎంపీలు బీహార్‌లో పదవీ విరమణ చేయనుండగా, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక నుంచి నలుగురు స‌భ్యులు బ‌య‌ట‌కు రానున్నారు. వీటితో పాటు ఒడిశా, మధ్యప్రదేశ్ నుంచి ముగ్గురు చొప్పున, ఛత్తీస్గఢ్, తెలంగాణ, పంజాబ్, హర్యానా, జార్ఖండ్ నుంచి ఇద్దరు చొప్పున, ఉత్తరాఖండ్ నుంచి ఒకరు రిటైర్ అయినప్పుడు సీట్లు ఖాళీ అవుతాయి.