ఉత్తరప్రదేశ్‌లో ఓ ముస్లిం విద్యార్థి చెంపపై తోటి విద్యార్థులతో కొట్టించిన వీడియో కలకలం రేపిన సంగతి తెలిసిందే. తోటి విద్యార్థులతో కొట్టించిన ఆ టీచర్ తాజాగా.. తన చర్యను సమర్థించుకున్నారు.
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఓ ముస్లిం విద్యార్థిపై తోటి విద్యార్థులతో చెంప దెబ్బలు కొట్టించిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. విద్వేషపు బీజాలు నాటితే ఇలాంటి ఘటనలే సాగవుతాయని ప్రతిపక్షాలు బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేశాయి. సదరు టీచర్ పై కేసు కూడా నమోదైంది. తాజాగా, ఆ టీచర్ తనను తాను సమర్థించుకుంటూ మాట్లాడారు.
తనలో మతానికి సంబంధించిన వివక్ష ఏమీ లేదని ఆ టీచర్ త్రిప్తా త్యాగి తెలిపారు. ‘ఆ పిల్లాడి తల్లిదండ్రుల నుంచి మాకు ఒత్తిడి ఉన్నది. నేను వికలాంగురాలిని. అందుకే ఆ విద్యార్థి హోం వర్క్ చేయడానికి ఇతర విద్యార్థులతో చెంపపై కొట్టించాను’ అని వివరించారు. ఆ వీడియోను ఎడిట్ చేశారని, దానికి మత విద్వేషపు కోణాన్ని చేర్చారని తెలిపారు. ‘అదే క్లాసు రూమ్‌లో ఆ విద్యార్థి కజిన్ కూడా ఉన్నాడు. ఆయనే ఈ వీడియో తీశాడు. కానీ, ఆ తర్వాత వీడియోను ఎడిట్ చేశారు’ అని వివరించారు.
Also Read: ముస్లిం క్లాస్ మేట్ ను చెంపదెబ్బ కొట్టాలని విద్యార్థులకు సూచించిన టీచర్.. యూపీలో ఘటన.. వీడియో వైరల్
ఇది చాలా చిన్న ఇష్యూ అని త్రిప్తా త్యాగి వివరించారు. దాన్ని పెద్ద విషయంగా వైరల్ చేశారని తెలిపారు. తన ఉద్దేశం విద్వేషం కాదని పేర్కొన్నారు. ‘నేను నా తప్పును అంగీకరిస్తున్నాను. కానీ, అనవసరంగా దీన్ని పెద్ద విషయంగా మార్చివేశారు... రాజకీయ నేతలకు ఇది చాలా చిన్న విషయం అని చెప్పదలిచాను. రాహుల్ గాంధీ వంటి నేతలూ దీన్ని ట్వీట్ చేశారు. కానీ, ట్వీట్ చేసేంత పెద్ద విషయమేమీ కాదు ఇది. రోజు వారీ ఇలాంటి విషయాలను వైరల్ చేస్తే ఉపాధ్యాయులు ఎలా బోధించాలి?’ అని ఆమె తెలిపారు.
ఈ టీచర్‌పై ఎఫ్ఐఆర్ ఫైల్ అయినట్టు ముజఫర్‌నగర్ జిల్లా మెజిస్ట్రేట్ అరవింద్ మల్లప్ప బంగారి తెలిపారు. ఆ తల్లిదండ్రులు తొలుత ఫిర్యాదు ఇవ్వలేదని, కానీ, ఈ రోజు ఉదయం ఫిర్యాదు చేసినట్టు వివరించారు. ఈ కేసులో న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
