భారత అంతరిక్ష పరిశోధన చరిత్రలోనే తొలిసారిగా ఓ ప్రైవేటు సంస్థ అభివృద్ధి చేసిన రాకెట్‌ను శుక్రవారం విజయవంతంగా ప్రయోగించడం ద్వారా సరికొత్త చరిత్ర మొదలైంది.

భారత అంతరిక్ష పరిశోధన చరిత్రలోనే తొలిసారిగా ఓ ప్రైవేటు సంస్థ అభివృద్ధి చేసిన రాకెట్‌ను శుక్రవారం విజయవంతంగా ప్రయోగించడం ద్వారా సరికొత్త చరిత్ర మొదలైంది. హైదరాబాద్‌కు చెందిన స్పేస్ టెక్ స్టార్ట్-అప్ స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ది చేసిన విక్రమ్‌-ఎస్ రాకెట్‌ ప్రయోగం విజయవంతం కావడం దేశంలోని ప్రైవేట్ అంతరిక్ష రంగంలో కొత్త శకానికి నాంది పలికింది. భారత అంతరిక్ష రంగ పితామహుడు విక్రమ్ సారాభాయ్‌ని గుర్తుచేస్తూ.. ఈ రాకెట్‌కు స్కై‌రూట్ విక్రమ్-ఎస్‌ అని పేరు పెట్టింది. ఈ మిషన్‌కు ప్రారంభ్ అని నామకరణం చేశారు. స్పేస్‌ కిడ్స్‌ ఇండియా (ఇండియా-తమిళనాడు), బజూమ్‌ క్యూ (ఆర్మేనియా), ఎన్‌-స్పేస్‌ టెక్‌ (ఇండియా-ఏపీ)కి చెందిన మూడు పేలోడ్‌లతో కలిపి 545 కిలోల బరువు, 6 మీటర్ల పొడవు గల ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. 

ప్రయోగించిన ఇరవై సెకన్ల తర్వాత విక్రమ్-ఎస్.. మాక్-5 హైపర్‌సోనిక్ వేగాన్ని సాధించింది. ఇది ధ్వని వేగం కంటే ఐదు రెట్లు ఎక్కువ. 155 సెకన్లలో 89.5 కిలోమీటర్ల గరిష్ట ఎత్తును తాకింది. విక్రమ్-ఎస్ దాదాపు ఐదు నిమిషాల పాటు గాలిలో ప్రయాణించింది. బంగాళాఖాతంలో స్ల్పాష్ డౌన్‌కు ముందు 121.2కిమీ పరిధిని కవర్ చేసింది.

అయితే ఈ మిషన్ సక్సెస్ కావడంతో స్కైరూట్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో, మిషన్ డైరెక్టర్ పవన్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. మిషన్ ప్రారంభ్.. న్యూ ఇండియా సామర్థ్యానికి ప్రతీక అని అన్నారు. ‘‘ఇది స్పేస్ స్టార్టప్‌లో ఒక చిన్న అడుగు.. భారతీయ అంతరిక్ష పరిశ్రమకు ఒక పెద్ద ముందడుగు’’ అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ, ఇస్రో, ఇన్-స్పేస్‌లకు ధన్యవాదాలు తెలిపారు. విక్రమ్-ఎస్ విజయం విమర్శకులను తప్పుగా నిరూపించిందని అన్నారు. నాగ భరత్ డాకా భాగస్వామ్యంతో స్కైరూట్‌ను ప్రారంభించినట్టుగా చెప్పారు. 

‘‘మేము స్కైరూట్‌ను ప్రారంభించినప్పుడు.. మీరు భారతదేశం నుంచి ప్రైవేట్ మార్కెట్‌లోకి ఎప్పటికీ ప్రారంభించలేరని చాలా మంది చెప్పారు. మరికొందరు ఇది చాలా లోతైన సాంకేతికత, రాకెట్ సైన్స్ అని అన్నారు. కానీ మేము మొదటి ప్రయత్నంలోనే అంతరిక్షాన్ని చేరుకున్నామని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది’’ అని పవన్ చెప్పారు. 

ఇదిలా ఉంటే రాకెట్ ప్రయోగాన్ని వీక్షించిన అనంతరం కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ఇది నిజంగా ఒక కొత్త ప్రారంభం అని చెప్పారు. భారతదేశం తన అంతరిక్ష పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో, ఈ రంగంలో ప్రపంచ నాయకులలో అగ్రగామిగా ఎదగడం కోసం ఈ మైలురాయిని పెద్ద ముందడుగు అని అభివర్ణించారు. ఇది భారతదేశ స్టార్టప్ ఉద్యమంలో ఒక మలుపు అని ఆయన అన్నారు.