ఫిలిబిత్: ఓ మహిళ తన ప్రియుడితో గడపడానికి భలే ఎత్తు వేసింది. 1500 కిలోమీటర్ల దూరంలో ప్రియుడితో చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతూ రాసలీలలు కొనసాగిస్తే భర్తకు తెలియదనే ఉద్దేశంతో ఆ ఎత్తు వేసింది. భర్త పాస్ పోర్టు వాడి ప్రియుడితో కలిసి ఆస్ట్రేలియాకు చెక్కేసింది. 

అయితే, అనూహ్యంగా పరిస్థితి ఎదురు తిరిగింది. లాక్ డౌన్ కారణంగా ఆమె అక్కడే చిక్కుకుపోయింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిలిబిత్ సమీపంలో గల దామ్ గరీ గ్రామానికి చెందిన వ్యక్తి (46) 20 ఏళ్లుగా ముంబైలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన భార్య (36) మాత్రం గ్రామంలోనే ఉంటోంది. 

భర్త గ్రామానికి మధ్యలో వచ్చివెళ్తుండేవాడు. ఈ క్రమంలో ఆమెకు స్థానికుడైన సందీప్ సింగ్ (36)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. జనవరిలో సందీప్ సింగ్ తో కలిసి ఆమె ఆస్ట్రేలియా వెళ్లింది. మే 18వ తేదీన వస్తానని భర్త చెప్పడంతో ప్రియుడితో కలిసి రెండు నెలల పాటు ఆస్ట్రేలియాలో వినోదించి రావాలని అనుకుంది. మార్చిలో తిరిగి వచ్చేయాలని అనుకుంది. 

ఆస్ట్రేలియాకైతే ఆమె వెళ్లింది గానీ పరిస్థితి ఆ తర్వాత ఎదురు తిరిగింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆమె అక్కడే చిక్కుకుని పోయింది. మే 18వ తేదీన గ్రామానికి వచ్చిన భర్తకు భార్య కనిపించలేదు. దీంతో భార్యపైనా, ఆమె ప్రియుడు సంతోష్ సింగ్ మీదా అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత ఆగస్టు 24వ తేదీన ఆస్ట్రేలియా నుంచి ప్రియుడితో కలిసి ఆమె తిరిగి వచ్చింది.