ఓ భర్త అత్యంతఘాతుకానికి ఒడిగట్టాడు. ఆన్ లైన్ రమ్మీకి బానిసై సొంతిల్లు అమ్మేశాడు. అడిగిన భార్యను హత్య చేసి, బెడ్ కింద దాచి పరారయ్యాడు.
చెన్నై : ఆన్ లైన్ రమ్మీకి బానిసైన ఓ భర్త దారుణానికి తెగబడ్డాడు. కష్టపడి కట్టుకున్న సొంతింటిని రూ. 28 లక్షలకు అమ్మేశాడు. ఆ సొమ్మును ఆన్లైన్ రమ్మీలో తగలబెట్టాడు. విషయం తెలిసిన భార్య ప్రశ్నించడంతో.. భార్యను హతమార్చి ప్లాస్టిక్ బ్యాగ్లో పార్శిల్ చేసి ఇంట్లోనే పెట్టాడు. ఇరుగు పొరుగు వారికి అనుమానం రాకుండా కరోనా నాటకాన్ని ఆడాడు. ఎవరికీ తెలియకుండా ఉడాయించాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే… ఆంధ్రప్రదేశ్, విజయవాడకు చెందిన నరసింహరాజు (38) తమిళనాడులోని తిరుచ్చికి వచ్చి స్థిరపడ్డాడు. పదకొండేళ్ల క్రితం తిరుచ్చి తిరువానై కావల్ కు చెందిన గోపీనాథ్ కుమార్తె శివరంజనిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఈ దంపతులకు సమయపురం శక్తినగర్ లో సొంత ఇల్లు ఉంది. అయితే కొన్నిరోజుల క్రితం నరసింహ రాజు భార్యకు చెప్పకుండా ఈ ఇంటిని అమ్మేశాడు. తాలకుడి సాయినగర్ లో ఇల్లు అద్దెకి తీసుకుని కుటుంబాన్ని అక్కడ ఉంచాడు. వీరితో పాటు నరసింహ రాజు తల్లి వసంతకుమారి (52) కూడా ఉంటుంది. అయితే, నిరుడు నరసింహరాజు ఆన్లైన్ రమ్మికి బానిసయ్యాడు. భార్య శివరంజని ఎంత వద్దని చెప్పినా పట్టించుకోలేదు. ఈ పరిస్థితుల్లోనే సమయపురం లోని ఇంటిని రూ. 28 లక్షలకు అమ్మి.. ఆ డబ్బు మొత్తం ఆన్లైన్ రమ్మీలో పోగొట్టాడు. విషయం తెలుసుకున్న శివరంజని ఈనెల 4వ తేదీన రాత్రి భర్తను నిలదీసింది.
సెక్స్ తర్వాత పెళ్లికి నిరాకరిస్తే అది అత్యాచారం కిందకు రాదు - కేరళ హైకోర్టు
దీంతో కోపోద్రిక్తుడైన నరసింహ రాజు భార్యను విచక్షణా రహితంగా కత్తితో పొడిచి హతమార్చాడు. ఆ తరువాత ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ కవర్లో చుట్టి బెడ్రూమ్లో బెడ్ కింద ఉంచాడు. మరుసటి రోజు తల్లి, పిల్లలను విజయవాడకు పంపించాడు. ఇరుగు పొరుగు వారికి అనుమానం రాకుండా తన భార్యకు కరోనా సోకిందని క్వారంటైన్ లో ఉందని నాటకం ఆడాడు. ఆ తర్వాత అక్కడి నుంచి తను కూడా వెళ్ళిపోయాడు. కాగా, రెండు రోజులుగా శివరంజని తీయకపోవడంతో ఆమె తండ్రి గోపీనాథ్ ఆందోళన చెందాడు. నరసింహ రాజు ఫోన్ పని చేయకపోవడంతో మరింత ఆందోళనకు గురయ్యాడు.
విజయవాడలోని అల్లుడి సోదరికి ఫోన్ చేసి విషయం కనుక్కున్నాడు. ఆమె కూడా శివరంజని కి కరోనా వచ్చినట్టు, ఇద్దరు పిల్లలు మాత్రం తన వద్ద ఉన్నట్లు సమాచారం ఇచ్చింది. దీంతో అనుమానం, ఆందోళనలతో గోపీనాథ్ గురువారం రాత్రి బంధువులతో కలిసి తాలకూడి సాయినగర్ లోని అల్లుడి ఇంటి దగ్గరకు వెళ్లారు. వాళ్లు వెళ్లేసరికి ఇంటికి తాళం వేసి ఉంది. ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా దుర్వాసన రావడంతో.. అనుమానంతో కొల్లిడం పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూడగా గదిలో బెడ్ కింద ప్లాస్టిక్ కవర్ లో కప్పి ఉన్న శివరంజని మృతదేహం బయటపడింది. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించిన పోలీసులు కేసు విచారణ వేగవంతం చేశారు. నిందితుడు నరసింహ రాజు కోసం గాలిస్తున్నారు.
