పాట్నా:  బీహార్‌లోని ముజఫర్‌పూర్‌ ఆసుపత్రికి సంబంధించి దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.  మెదడువాపు వ్యాధి  (అక్యూట్ ఎన్‌సెఫాలిటిస్ సిండ్రోమ్, ఏఈఎస్‌) తో పసిపిల్లల మరణాలతో శ్రీకృష్ణ వైద్య కళాశాల ఆస్పత్రి ఇప్పటికే వార్తల్లో నిలిచింది. ఈ ఆస్పత్రిలో చికిత్స పొందుతుశనివారానికి 108 మంది పిల్లలు మరణించారు. 

ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న  ఈ ఆసుపత్రి  సమీపంలో వందలాది పుర్రెలు, అస్థిపంజరాలు వెలుగు చూశాయి. మృతదేహాలలో  కొన్నింటిని  కాల్చివేసినట్లు, మరికొన్నింటిని సగం పూడ్చినట్లు అక్కడ చూస్తే అర్థమవుతోంది. మరికొన్ని శవాలను బస్తాల్లో కుక్కి అక్కడ పడేశారు. 

 

ఇది ఆసుపత్రికి చెందిన పోస్ట్‌మార్టం విభాగం నిర్వాకమనే విమర్శలు వస్తున్నాయి.  పోస్టుమార్టం తరువాత మృతదేహాలను ఇలా బహిరంగం పారేసినట్టుగా తెలుస్తోందని  ఆసుపత్రి  కేర్ టేకర్ జనక్ పాస్వాన్  మీడియాకు చెప్పారు. ఇది నిజంగా అమానవీయమని వ్యాఖ్యానించిన  ఆసుపత్రి సూపరింటెండెంట్‌  ఎస్‌కే షాహి సమగ్ర దర్యాప్తును కోరనున్నట్టు  చెప్పారు.

 

పోలీసు దర్యాప్తు బృందం సంఘటనా స్థలానికి వచ్చిన పరిస్థితిని పరిశీలించింది. గుర్తు తెలియని శవాలను ఇక్కడ కాల్చేసినట్లు అర్థమవుతోందని ఎస్ హెచ్ఓ సోనా ప్రసాద్ సింగ్ అన్నారు.