జమ్మూ కాశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో ఉన్న ఎల్ వోసీ వద్ద భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య మంగళవారం కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
జమ్మూకాశ్మీర్ లో భద్రత దళాలు భారీ విజయం సాధించాయి. కుప్వారా జిల్లా మచిల్ ప్రాంతంలోని నియంత్రణ రేఖ (ఎల్ వోసీ) సమీపంలో మంగళవారం ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. మిగిలిన వారి కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ విషయాన్ని జమ్మూ కాశ్మీర్ పోలీసులు అధికారికంగా ప్రకటించారు.
‘‘కుప్వారా జిల్లాలోని దోబనార్ మాచల్ ప్రాంతంలో ఆర్మీ, కుప్వారా పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ లో ఇద్దరు (02) ఉగ్రవాదులను హతమయ్యారు. ఇంకా గాలింపు కొనసాగుతోంది’’ అని కాశ్మీర్ పోలీసులు ట్వీట్ చేశారు. ఈ ఎన్ కౌంటర్ కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
గత నెల మొదట్లో కూడా కుప్వారాలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ సమయంలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. కుప్వారా జిల్లాలో మే 3వ తేదీన బుధవారం భద్రతా దళాలు- ఉగ్రవాదులకు మద్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లా పిచ్నాడ్ మచిల్ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగిందని పోలీసు అధికారి తెలిపారు.
గతేడాది సెప్టెంబర్ లో 25వ తేదీన ఇదే కుప్వారాలోని మచిల్ ప్రాంతంలోని టెక్రినార్ వద్ద నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) సమీపంలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. హతమైన ఉగ్రవాదుల నుంచి పలు ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ‘‘కుప్వారాలోని మచిల్ ప్రాంతంలోని నియంత్రణ రేఖ టెక్రి నార్ సమీపంలో ఆర్మీ-కుప్వారా పోలీసులు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. హతమైన ఉగ్రవాదుల గుర్తింపు ఇంకా తెలియాల్సి ఉంది. వారి వద్ద నుంచి రెండు ఏకే 47 రైఫిల్స్, రెండు పిస్టల్స్, నాలుగు హ్యాండ్ గ్రెనేడ్‌లు స్వాధీనం చేసుకున్నారు.’’ అని కాశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు.
