హైదరాబాద్:కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్‌గాంధీని అమూల్ బోయ్ అంటూ తొలుత విమర్శలు చేసింది సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యుడు , కేరళ మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్. తన వయస్సు గురించి రాహుల్‌గాంధీ చేసిన విమర్శలకు కౌంటర్‌గా వీఎస్ అచ్యుతానందన్ చేసిన విమర్శలు అప్పట్లో  దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. తాజాగా  పార్లమెంట్‌లో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో మరోసారి అమూల్ విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

2011లో కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా  కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్‌పై అప్పటి ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ  విమర్శలు గుప్పించారు. అచ్యుతానందన్ వయస్సుపై రాహుల్ విమర్శలు గుప్పించారు. లెఫ్ట్‌ఫ్రంట్‌ను గెలిపిస్తే 93 ఏళ్ల అచ్యుతానందన్ సీఎం అవుతాడన్నారు.

కాంగ్రెస్ పార్టీ యువతకు ప్రాతినిథ్యం వహిస్తోందని అచ్యుతానందన్‌పై ఆ సమయంలో రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్‌గా వీఎస్ అచ్యుతానందన్ స్పందించారు. 2011 ఏప్రిల్ 11 వ తేదీన కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. తన వయస్సు గురించి రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాహుల్ గాంధీ ఓ అమూల్ బోయ్ అంటూ  విమర్శలు గుప్పించారు. అమూల్ బోయ్‌ల కోసం రాహుల్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.  కొన్ని సభల్లో రాహుల్ చేసిన  ప్రసంగాలు చిన్న పిల్లలను తలపించేలా ఉన్నాయని అచ్యుతానందన్ ఎద్దేవా చేశారు.

తన వయస్సు 90 ఏళ్లు దాటొచ్చు... కానీ తాను ఇంకా యువకుడినే అన్నారు. తన తండ్రి అకాల మరణంతో తాను 7వ తరగతిలోనే చదువును నిలిపివేయాల్సి వచ్చిందన్నారు. కానీ, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా దోపీడీకి వ్యతిరేకంగా తన పోరాటం మాత్రం ఆపలేదని అచ్యుతానందన్ గుర్తు చేశారు.

ఈ సందర్భంగా ప్రముఖ మలయాళీ కవితను ఆయన చదివి విన్పించారు. రాహుల్‌ గాంధీని అచ్యుతానందన్  అమూల్ బేబీగా సంభోదించడం  అప్పట్లో పెద్ద సంచలనమే.  రాహుల్‌ను విమర్శించే వాళ్లు ఈ మాటను పదే పదే ప్రస్తావించేవారు.

ఇదిలా ఉంటే గుజరాత్ రాష్ట్రానికి చెందిన అమూల్ కంపెనీ కూడ తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకొనేందుకు  ఈ టాపిక్‌ తో చేసిన ప్రచారం ప్రత్యేకంగా చర్చనీయాంశంగా మారింది.  అందరీకీ  తమ ఉత్పత్తులు పనికొస్తాయని గతంలోనే ఈ కంపెనీ  చేసిన ప్రచారం పలువురిని ఆకర్షించింది. తాజాగా మోడీని రాహుల్ కౌగించుకోవడంపై  రూపొందించిన పిక్చర్ నెటిజన్ల ప్రశంసలు పొందుతోంది.