మహారాష్ట్ర ఉప ముఖ్యంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృతా ఫడ్నవీస్‌కు లంచం ఇవ్వజూపి, బ్లాక్‌మెయిల్ చేసేందుకు ప్రయత్నించిన కేసులో బుకీ అనిల్ జైసింఘాని, అతని కూతురు అనిక్ష జైసింఘానిలు కీలక నిందితులుగా ఉన్న  సంగతి తెలిసిందే.

మహారాష్ట్ర ఉప ముఖ్యంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృతా ఫడ్నవీస్‌కు లంచం ఇవ్వజూపి, బ్లాక్‌మెయిల్ చేసేందుకు ప్రయత్నించిన కేసులో బుకీ అనిల్ జైసింఘాని, అతని కూతురు అనిక్ష జైసింఘానిలు కీలక నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో నిందితుల లోకేషన్‌ను ఎలా కనుగొన్నారనే విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ కేసులో అరెస్ట్ కాకముందే అనిల్ 15 కేసుల్లో వాంటెడ్‌గా ఉన్నాడు. అయితే దాదాపు 8 ఏళ్లుగా పరారీలో ఉన్న అనిల్ తన ఆచూకీని దాచేందుకు పలు టెక్నిక్‌లను ఉపయోగిస్తుండడంతో అతడి ఆచూకీ దొరకడం కష్టమైంది.

అయితే ఈ సమయంలోనే అనిల్‌పై ఉన్న కేసులలో అతనికి సహాయం చేయడానికి అమృత ముందుకొచ్చారు. దేవేంద్ర ఫడ్నవీస్‌తో తనకున్న సంబంధాల గురించి కూడా చెప్పారు. ఫిబ్రవరి 22న అనిల్‌తో అమృత మాట్లాడుతూ.. ‘‘నిన్ను తప్పుగా ఇరికించినట్లయితే నేను దేవేంద్ర జీ (దేవేంద్ర ఫడ్నవీస్)తో మాట్లాడి అతనికి న్యాయం చేయమని చెప్పగలను. కానీ నేను అక్రమ డబ్బు సంపాదించడం గురించి అనిక్ష డిమాండ్‌లకు లొంగలేను. నాకు తెలుసు నేను ఏ తప్పు చేయలేదు. నన్ను బ్లాక్ మెయిల్ చేయాలనే ఉద్దేశ్యంతో నువ్వు, అనిక్ష మొదటి రోజు నుంచి ఈ పని చేస్తున్నారు. 

గరిష్టంగా ఈ వీడియోలు కొంతకాలం నా పరువు తీయవచ్చు. కానీ ఒక్కసారి నిజం బయటపడితే.. అది నాపై ఎటువంటి ప్రభావం చూపదు. మీరు నిజంగా న్యాయం కోసం అలా చేస్తుంటే.. నేను నిజంగా ఏమి చేయాలనుకుంటున్నావో చెప్పు’’ అని పేర్కొన్నారు. ఆ తర్వాత ఆమె కొన్ని పత్రాలు పంపమని కోరింది. ఈ క్రమంలోనే అనిల్ ఆమెకు అనేక ఆడియో సందేశాలను పంపాడు.

Also Read: అమృతా ఫడ్నవీస్‌కు బెదిరింపుల కేసు.. 72 గంటల్లో 750 కి.మీ ఛేజ్ చేసి క్రికెట్ బుకీ అరెస్ట్.. సినీ ఫక్కీలో..!

ఫిబ్రవరి 24న అమృత మళ్లీ అనిల్‌తో మాట్లాడారు. ఈసారి దేవేంద్ర ఫడ్నవీస్‌తో తనకున్న సంబంధాల గురించి చెప్పారు. అయితే ఇది తమ సలహా మేరకు జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. ‘‘ఫోన్‌లో మాట్లాడే బదులు, నేను సాగర్ బంగ్లాలో కాకుండా వేరే ప్రదేశంలో అనిక్షను కలుస్తాను. నేను కేసును అర్థం చేసుకుంటాను. దేవేంద్ర జీతో మాట్లాడతాను. నేను ఆమెను 26 తర్వాత మాత్రమే కలుస్తాను. దేవేంద్ర జీ 26వ తేదీ వరకు పూణే ఉప ఎన్నికలో బిజీగా ఉన్నారు’’ అని అనిల్‌తో అమృత చెప్పారు. 

‘‘2019 నుంచి మాకు మంచి సంబంధాలు లేవు. ఈ కేసు తర్వాత అతను నాకు విడాకులు ఇవ్వొచ్చని నేను భావిస్తున్నాను. కానీ అతని గురించి నాకు తెలిసిన ఒక విషయం ఏమిటంటే.. అతను ధృవీకరించిన తర్వాత.. మీరు బాధితురాలిగా భావించినట్లయితే.. 100 శాతం న్యాయం చేస్తారు’’ అని అమృత పేర్కొన్నారు. ఇక, ఈ కేసులో పోలీసులు తొలుత అనిక్షను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అనిల్ పట్టుకునేందుకు పోలీసులు మూడు రోజులు(72 గంటలు) పాటు 750 కి.మీ దూరం ప్రయాణించాల్సి వచ్చింది. చివరకు గుజరాత్‌ నుంచి అతడిని అదుపులోకి తీసుకున్నారు. 

కేసులో ఛార్జిషీట్.. 
లంచం, దోపిడీ ప్రయత్నాల కేసులో ముంబై పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్ ప్రకారం.. బుకీల గురించి పోలీసులకు సమాచారం ఇవ్వడం, వారిని అరెస్టు చేయడం ద్వారా వారు భారీ మొత్తం సంపాదించవచ్చని అనిల్ జైసింఘాని కుమార్తె అమృత ఫడ్నవీస్‌తో ఒకసారి చెప్పింది. ఇక, ఛార్జిషీట్‌లో అమృతా ఫడ్నవీస్, జైసింగ్‌హానీల మధ్య జరిగిన అనేక టెలిఫోనిక్ చాట్‌లను జాబితా చేసింది.

793 పేజీల డాక్యుమెంట్‌లో అనిల్ జైసింఘాని, అతని కుమార్తె అనిక్ష అతని బంధువు నిర్మల్‌లను లంచం డిమాండ్ చేసి అమృతా ఫడ్నవీస్ నుంచి డబ్బు వసూలు చేయడానికి ప్రయత్నించిన కేసులో నిందితులుగా పేర్కొన్నారు. ఇందులో అమృతా ఫడ్నవీస్‌తో అనిల్, అనిక్షలు జరిపిన వాట్సాప్ చాట్‌లు, సందేశాల స్క్రీన్‌షాట్‌లు ఉన్నాయి.