మహారాష్ట్ర ఉప ముఖ్యంత్రి దేవేద్ర ఫడ్నవీస్ సతీమణి అమృతా ఫడ్నవీస్‌కు లంచం ఇవ్వజూపి, బ్లాక్‌మెయిల్ చేసేందుకు ప్రయత్నించిన కేసులో క్రికెట్ బుకీ అనిల్ జైసింఘానిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే అనిల్ కూతురు అనిక్షను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మహారాష్ట్ర ఉప ముఖ్యంత్రి దేవేద్ర ఫడ్నవీస్ సతీమణి అమృతా ఫడ్నవీస్‌కు లంచం ఇవ్వజూపి, బ్లాక్‌మెయిల్ చేసేందుకు ప్రయత్నించిన కేసులో కీలక నిందితుడుగా ఉన్న 57 ఏళ్ల క్రికెట్ బుకీ అనిల్ జైసింఘానిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. అయితే అనిల్ జైసింఘానిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. అతడి పట్టుకునేందుకు పోలీసులు మూడు రోజులు(72 గంటలు) పాటు 750 కి.మీ దూరం ప్రయాణించాల్సి వచ్చింది. చివరకు గుజరాత్‌ నుంచి అతడిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. ఒక‌ క్రిమినల్ కేసులో జోక్యం చేసుకోవడానికి త‌న‌కు డబ్బు ఇవ్వడానికి ప్రయత్నించారనీ, అలాగే తనను బెదిరించారని మ‌హిళా డిజైన‌ర్ అనిక్షపై అమృతా ఫ‌డ్న‌వీస్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. తాను అందుకు నిరాకరించడంతో మార్ఫింగ్ వీడియోలను సర్క్యులేట్ చేస్తానని బెదిరించినట్టుగా తెలిపారు. 

అమృతా ఫడ్నవీస్ ఫిర్యాదు మేరకు దక్షిణ ముంబైలోని మలబార్ హిల్ పోలీసులు ఈ కేసులో ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్) నమోదు చేశారు. కొద్ది రోజుల కింద ఈ కేసులో అనిక్షను అరెస్ట్ చేశారు. అయితే ఇందులో కీలకంగా వ్యవహరించిన అనిక్ష తండ్రి అనిల్ జైసింఘానిని పట్టుకునేందుకు పోలీసులు ఆపరేషన్ నిర్వహించారు. ఉల్హాస్‌నగర్ నివాసం నుంచి అనిక్షను అదుపులోకి తీసుకున్న తర్వాత.. దాదాపు 40 మంది పోలీసులతో కూడిన ఐదు బృందాలు ఆమె తండ్రిని ట్రాక్ చేసేందుకు ఏర్పాటు చేసినట్టుగా పోలీసులు తెలిపారు. 

గురువారం పోలీసులు అనిల్ జైసింఘాని మొబైల్‌ను ట్రాక్ చేయడం ప్రారంభించినప్పుడు.. అతను మీరా రోడ్‌లో ఉన్నట్లు గుర్తించారు. అయితే పోలీసు బృందాలు అక్కడికి చేరుకునేలోపే అతడు వెళ్లిపోయాడు. ఆ తర్వాత సైబర్ పోలీసులు.. అతడు గుజరాత్‌లోని బార్డోలీ ఉన్నట్టుగా గుర్తించి.. క్రైమ్ బ్రాంచ్ మూడు బృందాలను అక్కడికి పంపింది. సూరత్ పోలీసులతో పాటు క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన 12 మంది పోలీసులు బార్డోలీలోని ఒక చిన్న ప్రాంతంలో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించారు. అయితే అనిల్ జైసింఘని పోలీసులకు దొరకకుండా తప్పించుకున్నారు. 

ఆ తర్వాత అనిల్ జైసింఘని ఫోన్ అతడు సూరత్‌లో ఉన్నట్టుగా చూపించింది. దీంతో పోలీసులు సూరత్ వైపు వెళ్లడం ప్రారంభించినప్పుడు.. బుకీ అప్పటికే గోద్రా వైపు వెళుతున్నట్లు కనుగొన్నారు. చివరికి దాదాపు 750 కి.మీ.లు అతనిని అనుసరించిన తర్వా.. గుజరాత్‌లోని గోద్రా జిల్లాలోని కలోల్ టోల్ ప్లాజా వద్ద పోలీసు బృందాలు అతనిని, మరో ఇద్దరిని ఆదివారం రాత్రి 11 గంటలకు జైసింఘానిని పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.

సోమవారం ముగ్గురిని ముంబైకి తీసుకొచ్చారు. అనిల్ జైసింఘానిని అరెస్టు చేశామని, మంగళవారం కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అనిల్ జైసింఘాని నుంచి మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు అతని కాల్ వివరాల రికార్డులను పరిశీలిస్తున్నారు. అరెస్టును తప్పించుకునే సమయంలో.. అనిల్ జైసింఘాని గత గురువారం ఈ కేసులో అరెస్టయిన అతని కుమార్తె అనిక్షతో టచ్‌లో ఉన్నాడని పోలీసు వర్గాలు తెలిపాయి. అయితే ఈ కేసులో అనిల్ జైసింహాని, అనిక్షను కలిసి విచారించే ఆలోచనలో పోలీసులు ఉన్నారు. 

వివరాల ప్రకారం.. అనిక్ష ఫ్యాషన్ డిజైనర్‌గా నటిస్తూ అమృతా ఫడ్నవీస్‌తో స్నేహం చేసింది. ఆ తర్వాత క్రికెట్ బుకీల గురించిన సమాచారాన్ని అమృతకు అందజేస్తానని.. వారిద్దరూ డబ్బు సంపాదించవచ్చని చెప్పింది. దీంతో అమృత ఆమెతో కమ్యూనికేట్ చేయడం మానేసింది. అయితే అనిల్ జైసింఘానిని అన్ని ఆరోపణల నుండి క్లియర్ చేయడానికి బదులుగా అనిక్ష ఆమెకు రూ. కోటి లంచం ఇస్తానని చెప్పింది. అందుకు అమృత నిరాకరించింది. దీంతో అమృతపై అనిక్ష బెదిరింపులకు దిగి బ్లాక్ మెయిల్ చేయాలని చూసింది. 

ఇక, అనిల్ జైసింఘాని పేరుమోసిన బుకీ.. అతడు ఎనిమిదేళ్లుగా పరారీలో ఉన్నాడు. 2015 ప్రారంభంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గుజరాత్ యూనిట్ అతనిపై మనీ లాండరింగ్ విచారణ ప్రారంభించిన తర్వాత అతను దేశం విడిచి పారిపోయాడు. ఇక, మహారాష్ట్ర, గోవా, గుజరాత్‌లలో అతనిపై కనీసం 14 కేసులు నమోదయ్యాయి. వీటిలో చాలా వరకు బెట్టింగ్‌కు సంబంధించినవే.