Asianet News TeluguAsianet News Telugu

గుజరాత్‌లో ముస్లిం ఎమ్మెల్యేలు ఎంత మంది? గతంతో పోలిస్తే ఎంతమంది తగ్గారు? ఏ పార్టీ ఎంతమందిని బరిలోకి దింపింది?

గుజరాత్ అసెంబ్లీలో ముస్లిం ఎమ్మెల్యేల సంఖ్య మరింత తగ్గిపోయింది. గతంలో ముగ్గురు ముస్లిం ఎమ్మెల్యేలు ఉండగా, ఈ సారి కేవలం ఒక్కరే ఉన్నారు. ఆ ఏకైక ముస్లిం ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచే కావడం గమనార్హం. 12 మంది ముస్లింలను బరిలోకి దించిన ఎంఐఎం ఒక్క చోటా గెలువలేకపోయింది.
 

how many muslim mlas are there in gujarat assembly
Author
First Published Dec 10, 2022, 4:00 PM IST

అహ్మదాబాద్: గుజరాత్‌లో ముస్లిం ఎమ్మెల్యేల సంఖ్య మరింత కుచించుకుపోయింది. గతంలో ముగ్గురు ముస్లిం ఎమ్మెల్యేలు ఉండేవారు. ఆ ముగ్గురూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే. కానీ, ఈ సారి ఈ సంఖ్య ఒక్కటికి తగ్గిపోయింది. ఆ ఏకైక ముస్లిం ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేనే. గుజరాత్ అసెంబ్లీ స్థానాల సంఖ్య 182. రాష్ట్రంలో సుమారు 10 శాతం జనాభా గల ముస్లిం కమ్యూనిటీ నుంచి ఇక్కడ ఏకైక ముస్లిం ఎమ్మెల్యే ఉండటం గమనార్హం. ఇటీవలే జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

అహ్మదాబాద్ సిటీలోని జమల్‌పూర్ - ఖాడియా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇమ్రాన్ ఖేడవాలా ఎమ్మెల్యేగా 13,658 మెజార్టీ ఓట్లతో గెలిచారు. బీజేపీ అభ్యర్థి భూషణ్ భట్ పై ఆయన గెలుపొందారు. ఇక్కడి నుంచి ఎంఐఎం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే సాబిర్ కబ్లివాలా కూడా బరిలో నిలిచారు. 

ఈ సారి కాంగ్రెస్ పార్టీ ఆరుగురు ముస్లిం ఎమ్మెల్యేలను బరిలో దించింది. ఇందులో ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అందులో ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు సహా ఐదుగురు ఓటమి పాలయ్యారు. 2017లో ఇదే పార్టీ ఐదుగురు ముస్లిం సభ్యులను బరిలోకి దించగా.. ముగ్గురు గెలిచారు.

Also Read: ముస్లిం మహిళలను ఎన్నికల్లో దింపేవారు ఇస్లాంకు వ్యతిరేకం -జామా మసీదు ప్రధాన మతాధికారి షబ్బీర్ అహ్మద్ సిద్ధిఖీ

దరియాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే గయాసుద్దీన్ షేక్ బీజేపీ అభ్యర్థి కౌషిక్ జైన్ చేతిలో ఓడిపోయారు. మరో సిట్టింగ్ ఎమ్మెల్యే మొహమ్మద్ జావేద్ పిర్జాదా మోర్బి జిల్లాలోని వాంకనీర్ స్థానం నుంచి ఓటమి పాలయ్యారు. అక్కడ బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. ఆప్ అభ్యర్థి 53,110 ఓట్లు పొందడం పిర్జాదా ఓటమికి కారణమైందని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.

కచ్ జిల్లాలోని అబ్దాసా స్థానంలో ముస్లిం క్యాండిడేట్ జాట్ మామద్ జంగ్ పై బీజేపీ టికెట్ పై పోటీ చేసిన మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రద్యుమాన్ సిన్హా జడేజా సుమారు 9,000 వోట్లతో గెలుపొందారు.

కాగా, ఆప్ కూడా ముగ్గురిని బరిలోకి దింపగా.. అందులో ఎవరూ గెలువలేదు. బీజేపీ ఒక్కరినీ కూడా ముస్లిం అభ్యర్థిని బరిలోకి దింపలేదు. ఎంఐఎం దింపిన 12 మంది అభ్యర్థులూ దారుణంగా ఓడిపోయారు.

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 156 సీట్లు, కాంగ్రెస్ 17 సీట్లు, ఆప్ ఐదు సీట్లు గెలుచుకుంది. గుజరాత్ చరిత్రలో ఒక పార్టీ 156 సీట్లు గెలుచుకోవడం ఇదే తొలిసారి.

Follow Us:
Download App:
  • android
  • ios