Dead bodies in Ganga River: కరోనా సమయంలో గంగా నది ఒడ్డున ఖననం చేసి మృతదేహాల విషయంలో నివేదికను సమర్పించాల్సిందిగా యూపీ-బీహార్ ప్రభుత్వాలను ఎన్జీటీ (NGT) ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ అరుణ్ కుమార్ త్యాగి, నిపుణుడు సభ్యుడు డాక్టర్ అఫ్రోజ్ అహ్మద్‌లతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై వాస్తవ ధృవీకరణ నివేదికను సమర్పించాల్సిందిగా కోరింది.
Dead bodies in Ganga River: కరోనా వేళ.. యూపీ, బీహార్ రాష్ట్రాలోని గంగా నది ఒడ్డున భారీ సంఖ్యలో మృతదేహాలు బయట పడి తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే.. కరోనా సెకండ్ వేవ్ సమయంలో గంగా నదిలో వందలాది శవాలు కుప్పలు తెప్పలుగా బయటపడ్డాయి. ఈ విషయం మరోసారి తెర మీదకి వచ్చింది. ఈ విషయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చాలా సీరియస్ అయ్యింది. ఆ సమయంలో అసలు ఎన్ని శవాలు బయటపడ్డాయి? ఈ ఏడాది మార్చి 31 వరకు ఎన్ని శవాలు పుడ్చి పెట్టారో చెప్పాలంటూ.. యూపీ, బీహార్ రాష్ట్రాలను గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) ఆదేశించింది.
జస్టిస్ అరుణ్ కుమార్ త్యాగి, నిపుణుడు సభ్యుడు డాక్టర్ అఫ్రోజ్ అహ్మద్‌లతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై వాస్తవ ధృవీకరణ నివేదికను సమర్పించాల్సిందిగా ఉత్తరప్రదేశ్ , బీహార్ ప్రభుత్వాల అదనపు ప్రధాన కార్యదర్శి (హోమ్), అదనపు ప్రధాన కార్యదర్శి/ప్రిన్సిపల్ సెక్రటరీ (ఆరోగ్యం)లను కోరింది. మార్చి 31 వరకు గంగా నదిలో ఎన్ని మృతదేహాలు ఖననం చేశారో చెప్పాలంటూ ధర్మాసనం ప్రశ్నించింది.
కోవిడ్-19 వ్యాప్తికి ముందు 2018, 2019 సంవత్సరాల్లో.. కోవిడ్ -19 మహమ్మారి ప్రారంభమైన తర్వాత 2020, 2021 సంవత్సరాల్లో ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో గంగా నదిలో ఎన్ని మృతదేహాలు తేలాయనేది చెప్పాలని కోరింది. ఈ సంవత్సరం మార్చి 31 వరకు నది ఒడ్డున ఎంత మందిని ఖననం చేశారో చెప్పాలని ప్రశ్నించింది.
ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రభుత్వాలు ఎన్ని సందర్భాల్లో మృతదేహాలను దహనం చేయడానికి లేదా ఖననం చేయడానికి ఏమైనా ఆర్థిక సహాయం అందించాయా? గంగా నదిలో మృతదేహాలు ప్రవహించకుండా లేదా నది ఒడ్డున మృతదేహాలను ఖననం చేయకుండా ప్రజలకు అవగాహన కల్పించడానికి.. ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అనే విషయం కూడా ప్రశ్నించింది.
కరోనా వైరస్ బారిన పడిన మానవ మృతదేహాలను పారవేయడంపై సరైన ప్రోటోకాల్‌ను అనుసరించేలా ఆదేశాలను కోరుతూ జర్నలిస్ట్ సంజయ్ శర్మ దాఖలు చేసిన పిటిషన్‌ను ఎన్‌జిటి విచారించింది.
