ముస్లిం మహిళతో తిరుగుతున్నాడనే కారణంతో ఓ హిందూ యువకుడిని అల్లరిమూకలు చితకబాదాయి. నడి రోడ్డుపై యువతిని కూడా దుండగులు కొట్టారు. తల్లిదండ్రుల పేర్లు చెప్పాలని ఆమెను బెదిరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ముస్లిం యువతితో కలిసి తిరుగుతున్నాడని అదే సామాజిక వర్గానికి చెందని పలువురు యువకులు ఓ హిందూ యువకుడిపై దాడి చేశారు. ఆ యవతిని కూడా తిడుతూ, చెంపపై కొట్టారు. అదే సమయంలో అతడిని చితకబాదారు. ఈ ఘటన గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు, ‘ఇండియా టుడే’ కథనం ప్రకారం.. అహ్మదాబాద్ సిటీలోని ఓ కాలనీలో 21 ఏళ్ల సునీల్ నాయుడు నివసిస్తున్నాడు. అతడి ఇంటికి సమీపంలో సానియా షేక్ అనే యువతి నివసిస్తోంది. వారిద్దరూ కలిసి స్కూటీపై ఆగస్టు 26వ తేదీన మధ్యాహ్నం సమయంలో ఏదో పని మీద బయటకు వెళ్లి, తిరిగి తాము నివసించే ప్రాంతానికి వస్తున్నారు. ఈ క్రమంలో వారు డానిలిమ్డా ప్రాంతానికి చేరుకున్నారు.
అయితే మోతీ బేకరీ ఎదురుగా ఉన్న చిరాగ్ హైస్కూల్ సమీపంలోకి రాగానే వారిని ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు యువకులు అడ్డగించారు. వారిద్దరి పేర్లు, చిరునామా అడిగి తెలుసుకున్నారు. ‘నువ్వు ఎవరి కూతురువో చెప్పు. మీ పేరెంట్స్ ను పిలుస్తాం’ అని ఆ యువతిని బెదిరిస్తూ ఆమెను చెంపదెబ్బ కొట్టారు. దీంతో సునీల్ అడ్డుకొని తనకూ, సానియాకు మధ్య ఉన్న సంబంధం గురించి తమ ఇద్దరు తల్లిదండ్రులకు బాగా తెలుసని బదులిచ్చాడు.
దీంతో ఆ యువకులు మరింత రెచ్చిపోయి.. ‘నువ్వు హిందువు. మా ముస్లిం అమ్మాయితో తిరుగుతున్నావు. ముస్లిం యువతితో తిరగడానికి నీకెంత ధైర్యం’ అని అతడి చుట్టూ గుమిగూడి హెచ్చరించారు. అసభ్య పదజాలంతో దూషించారు. బురఖా ధరించి ఉన్న సానియాను, సునీల్ ను చితకబాదారు. దీనిని అక్కడే ఉన్న పలువురు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది విస్తృతంగా వైరల్ అయ్యింది.
దీంతో డానిలిమిడా పోలీసులు రంగంలోకి దిగారు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించారు. అక్బర్ పఠాన్, ఫైజాన్ షేక్, హుస్సేన్ సయ్యద్ అనే ముగ్గురే దాడి చేసిందని గుర్తించారు. వారిపై ఐపీసీ సెక్షన్లు 392, 394, 323, 153ఏ(1), 294(బి), 506(1), 114 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో సానియాను సాక్షిగా చూపించారు.
