ఆగ్రా: మొఘల్స్ మీద ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ లోని చారిత్రక నగరంలో నిర్మిస్తున్న మొఘల్ మ్యూజియానికి మరాఠీ మహాపురుషుడు ఛత్రపతి శివాజీ పేరు పెట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. మొఘల్స్ మన హీరలు ఎలా అవుతారని ఆయన ప్రశ్నించారు. 

ఆగ్రాలోని అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆ విధంగా అన్నారు. బానిస మనస్తత్వానికి సంబంధించిన విషయాలను తొలగించనున్నట్లు ఆయన తెలిపారు. 

తన మూడేళ్ల పాలనలో యోగి ఆదిత్యనాథ్ పలు ప్రాంతాల పేర్లను మార్చేశారు. అలహాబాద్ ను ప్రయాగరాజ్ గా మార్చిన విషయాన్ని ఆ తర్వాత ట్వీట్ చేసారు. బానిస మనస్తత్వానికి సంబంధించిన చిహ్నాలకు స్థానం లేదని ఆయన చెప్పారు. 

ఆగ్రాలో నిర్మిస్తున్న మ్యూజియానికి ఛత్రపతి శివాజీ పేరు పెట్టనున్నట్లు తెలిపారు. "శివాజీ మహరాజ్ మన హీరో. జై హింద్, జై భారత్" అని ఆయన ట్వీట్ చేశారు. 

తాజ్ మహల్ కు సమీపంలో ఆరు ఎకరాల్లో మ్యూజియాన్ని నిర్మించే ప్రాజెక్టును గత అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం 2015లో ఆమోదం తెలిపింది. ఆ మ్యూజియంలో మొఘల్ సంస్కృతి, కళాకృతులు, వంటలు, ఆచారాలు, మొఘల్ కాలంనాటి ఆయుధ సామగ్రిని, కళాప్రదర్శనలను ప్రతిబింబించే విధంగా రూపుదిద్దాలని తలపెట్టారు.