భారత్ రైస్ ఎలా కొనుక్కోవచ్చు? ఎక్కడ దొరుకుతాయంటే...?
నేటినుంచి మార్కెట్లోకి భారత్ రైస్ రానున్నాయి. కిలో రూ.29లకే అందుబాటులో ఉండనున్న ఈ బియ్యం ఎలా ఉంటాయి? ఎక్కడ కొనుక్కోవచ్చు? అనే సందేహాలు అందరిలోనూ ఉన్నాయి. ఆ బియ్యాన్ని ఎలా కొనుక్కోవచ్చో ఇక్కడ చూడండి.
ఢిల్లీ : భారత్ రైస్ పేరుతో రూ. 29 రూపాయలకే కిలో బియ్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తుంది భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం మంగళవారం అంటే ఫిబ్రవరి 6.. నేటి నుంచి ప్రారంభం కానుంది. రోజురోజుకీ విపరీతంగా పెరిగిపోతున్న సన్న బియ్యం ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వీరికి ఊరట కలిగించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కేంద్ర ఆహార శాఖ మంత్రి పియూష్ గోయల్.. మంగళవారం నాడు రూ.29కే కిలో భారత్ రైస్ అందించే కార్యక్రమాన్ని ఢిల్లీలోని కర్తవ్య పథ్ లో ప్రారంభించనున్నారు.
దీనికోసం ఐదు లక్షల టన్నుల బియ్యాన్ని భారత ఆహార సంస్థ నుంచి సేకరించారు. ఈ బియ్యాన్ని మొదటి విడతలోభారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య.. నాఫెడ్ (NAFED), జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య (NCCF), కేంద్రీయ భండార్ విక్రయకేంద్రాల దగ్గర అమ్మనున్నారు.
'చపాతీ'లా కాదు, 'పొంగిన పూరీ'లా... భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలపై హాట్ కామెంట్స్
అయితే ఇప్పుడే ఈ బియ్యం బయట బహిరంగ మార్కెట్లో దొరకకపోవచ్చు. అయితే, ఆన్లైన్లో అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ బియ్యం కొనుక్కోవాలంటే.. నాఫెడ్ అధికారిక వెబ్సైట్ https://www.nafedbazaar.com/product-tag/online-shoppingలో కొనుక్కోవచ్చు. ఈ వెబ్ సైట్ లో బియ్యంతో పాటు.. పప్పులు, చక్కెర, గోధుమ పిండి, ఉల్లిపాయలు, టమాటాలు లాంటివి అందుబాటులో ఉన్నాయి. ఇందులో భారత్ రైస్ 5 కిలోలు, 10 కిలోల బ్యాగుల్లో అందుబాటులో ఉంచనున్నారు.
భారత్ బ్రాండ్ పేరుతో తక్కువ ధరలకే నిత్యావసర సరుకులను సామాన్యులకు అందుబాటులోకి తేవడమే దీని ప్రధాన ఉద్దేశం. గత నవంబర్ ఆరవ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం గోధుమపిండిని రూ.27.50కే ఇందులో అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ధరలు శనగపప్పు కిలో రూ.60కి దొరుకుతుంది. అయితే, భారత్ రైస్ ను నాఫెడ్ తో పాటు మిగతా ఈ కామర్స్ సైట్స్ లో కూడా కొనుగోలు చేయవచ్చు.
నాఫెడ్ లో ఎలా కొనుగోలు చేయచ్చు?
ఇది ఆన్లైన్ సైట్ లా కనిపించినప్పటికీ ఇందులో కొనుగోలు చేయాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ తప్పనిసరి. రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత లాగిన్ అయ్యి, మీ అడ్రస్ వివరాలను నమోదు చేయాలి. ఆ తర్వాతే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇటీవల కాలంలో బియ్యం ధర ఒక్కసారిగా పెరుగుతూ వస్తోంది. రూ. 50 నుంచి 60 దాటి పైకి పోతుంది. అంత ధరతో బియ్యం కొనుక్కోలేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే మంచి రకం సన్నబియాన్ని తక్కువ ధరలకు అందించడానికి కేంద్ర ప్రభుత్వం భారత్ రైస్ పేరుతో ముందుకు వచ్చింది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరుతోంది.