సారాంశం

పంజాబ్ పోలీసులను నాలుగు రోజులు ముప్పుతిప్పలు పెట్టించి వారికి చిక్కకుండా అమృత్‌పాల్ సింగ్ పరారయ్యా డు. వందలాది మంది పోలీసులు పదుల సంఖ్యల వాహనాల్లో చేజ్ చేసినా అతన్ని పట్టుకోలేకపోయారు. తాజాగా, కొన్ని సీసీటీవీ ఫుటేజీల ద్వారా కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఆ చేజ్‌లో సింగ్ వాహనాలు మార్చాడని, అంతేకాదు, దుస్తులనూ చేంజ్ చేసి లుక్ మార్చాడని అర్థం అవుతున్నది.
 

న్యూఢిల్లీ: పంజాబ్ పోలీసుల కళ్లుగప్పి అమృత్‌పాల్ సింగ్ తప్పించుకుపోయాడు. నాలుగు రోజులపాటు నాటకీయంగా సాగిన పోలీసుల చేజ్ నుంచి సింగ్ ఊహించని రీతిలో ఎస్కేప్ అయ్యాడు. అమృత్‌పాల్ సింగ్‌ను పట్టుకోవడానికి పంజాబ్‌లోని పలు చోట్ల ఇంటర్నెట్ సేవలు కూడా నిలిపేశారు. డజన్ల సంఖ్యలో పోలీసు వాహనాలు రోడ్లపై రయ్ రయ్ మంటూ దూసుకెళ్లాయి. కానీ, వందలాది పోలీసు అధికారుల చేజ్ నుంచి సింగ్ బయటపడ్డాడు. ఇప్పుడు ఆయన వెళ్లిన దారిలో పలు సీసీటీవీల ఫుటేజీ పరిశీలిస్తే కొన్ని కీలక విషయాలు అర్థం అవుతున్నాయి.

ఎన్‌డీటీవీ కొన్ని సీసీటీవీల ఫుటేజీని పరిశీలించాయి. 30 ఏళ్ల అమృత్‌పాల్ సింగ్ శనివారం ఉదయం 11.27 గంటల ప్రాంతంలో జలందర్‌లో ఓ టోల్ బూత్‌ సీసీటీవీ ఫుటేజీలో కనిపించాడు. అదే రోజు పోలీసులు అతని కోసం ఆపరేషన్ ప్రారంభించారు. అప్పుడు మారుతి బ్రెజ్జా కారు ముందు సీట్లో కూర్చుని ఉన్నాడు.

అంతకు ముందు ఆయన మెర్సిడెస్ ఎస్‌యూవీ కారులో కనిపించాడు. ఆ కారును తర్వాత షాకోట్‌లో రోడ్డు పక్కనే వదిలిపెట్టారు. గంటల తర్వాత అతను బ్రెజ్జా కారులోకి షిప్ట్ అయినట్టు తెలుస్తున్నది. ఆ తర్వాత టూ వీలర్ పైకి మారాడు. పచ్చిక బయళ్లు ఎక్కువగా ఉన్న చోట రోడ్డుపై వారు బైక్ పైకి మారినట్టు సమాచారం. ముగ్గురు కలిసి రెండు టూ వీలర్‌లపై వెళ్లుతున్న ఫుటేజీ కూడా కనిపించింది. 

Also Read: రూ. 2.9 కోట్ల లాటరీ గెలుచుకున్న భార్య మరొకరిని పెళ్లి చేసుకుంది.. షాక్‌లో భర్త

సింగ్ కేవలం వాహనాలు మార్చడమే కాదు.. దుస్తులనూ మార్చేశాడు. ఆ ఫుటేజీల ప్రకారం, ఆయన సాంప్రదాయ దుస్తులను వదిలి షర్ట్, ప్యాంట్ ధరించాడు. బ్లూ టర్బన్ నుంచి పింక్ టర్బన్‌కు మారాడు.

అయితే, అమృత్‌పాల్ సింగ్ వేషధారణ మార్చితే ఎలా ఉంటాడు.. అని ఊహించి పలు రకాల ఫొటోలను పంజాబ్ పోలీసులు విడుదల చేశారు. తద్వార ప్రజలు గుర్తించి పోలీసులకు సమాచారం ఇస్తారని భావిస్తున్నారు.

బ్రెజ్జా కారును సీజ్ చేసిన పోలీసులు సింగ్ పారిపోవడానికి సహకరించిన నలుగురిని అరెస్టు చేశారు. శనివారం నుంచి సింగ్ బంధువులు సహా దాదాపు 120 మందిని పోలీసులు అరెస్టు చేశారు.