ఇంటి పనుల బాధ్యత ఇద్దరిదీ.. భార్యనే చేయాలనుకోవడం సరికాదు: బాంబే హైకోర్టు
ఆధునిక సమాజంలో ఇంటి పనులను కేవలం భార్యనే చేయాలని ఆశించడం తిరోగమన ఆలోచనే అని బాంబే హైకోర్టు తెలిపింది. ఇంటి పనులను భార్య, భర్త ఇద్దరూ సమానంగా పంచుకోవాలని వివరించింది. ఈ రూలింగ్ ఇస్తూ విడాకుల పిటిషన్‌ను తిరస్కరించింది.

ముంబయి: ఆధునిక సమాజంలో ఇంటి పనులు మొత్తం భార్యనే చూసుకోవాలనుకోవడం సరికాదని బాంబే హైకోర్టు తెలిపింది. ఇంటి పనుల బాధ్యతను దంపతులిద్దరూ సమానంగా పంచుకోవాలని రూలింగ్ ఇచ్చింది. న్యాయమూర్తులు నితిన్ సాంబ్రె, శర్మిలా దేశ్‌ముఖ్‌ల డివిజన్ బెంచ్ ఓ విడాకుల కేసును డిస్మిస్ చేస్తూ ఈ ఆదేశాలు ఇచ్చింది.
35 ఏళ్ల వ్యక్తి 13 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్న భార్యతో విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేశాడు. ఫ్యామిలీ కోర్టు ఆయన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. దీంతో ఆయన బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. తన భార్య క్రూరత్వాన్ని ఆయన నిరూపించలేకపోయాడని ధర్మాసనం పేర్కొంటూ డిస్మిస్ చేసింది.
2010లో వీరికి పెళ్లి జరిగింది. వీరిద్దరూ ఉద్యోగులే. తన పిటిషన్‌లో ఆ వ్యక్తి తన భార్య ఎల్లప్పుడూ వారి కుటుంబంతో ఫోన్ మాట్లాడుతూనే ఉంటుందని భర్త ఆరోపించాడు. ఇంటిలో పనులేవీ చేయదని తెలిపాడు. కాగా, ఇంట్లో పనులన్నీ తానే చేయాలని భర్త తనను బలవంతపెడతాడని భార్య పేర్కొంది. తన కుటుంబాన్ని కలిస్తే దూషిస్తాడని తెలిపింది. చాలా సార్లు తనపై భౌతికంగా దాడి చేశాడని ఆరోపించింది.
వాదనలు విన్న తర్వాత డివిజన్ బెంచ్ తన ఆర్డర్ కాపీలో ఇంటి పనులన్నీ కేవలం భార్యనే చేయాలని ఆశించడం తిరోగమనపు మైండ్‌సెట్ అని తెలిపింది.
‘ఆధునిక సమాజంలో ఇంటి పనుల బాధ్యతనూ భార్య, భర్త ఇద్దరూ సమానంగా పంచుకోవాలి. ఆదిమ కాలపు మైండ్‌సెట్ మాత్రమే ఇంటిలోని పనులన్నీ కేవలం భార్యనే చేయాలని అనుకుంటుంది. ఆ ఆలోచన ధోరణిలో సానుకూల మార్పులు రావాలి’ అని హైకోర్టు వివరించింది.
Also Read: భార్యపై తండ్రి రేప్.. ఇప్పుడు నువ్వు నా మమ్మివి అని వదిలేసిన భర్త
తన కుటుంబంతో మాట్లాడటం మూలంగా ఎదుటి వారిపై మానసిక క్షోభను పెడుతున్నదని ఊహించలేమని కోర్టు తెలిపింది. నిజానికి ఆమెను వారి కుటుంబ సభ్యులతో అసలు సంబంధాలే లేకుండా ఉండాలనడమే మానసిక క్రూరానికి సంకేతంగా చూడాల్సి ఉంటుంది’ అని బెంచ్ స్పష్టం చేసింది.