దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తూనే ఉంది. ప్రతిరోజు లక్షలాదిగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. పాజిటివ్ లక్షణాలతో రోగులు ఆసుపత్రులకు పోటేత్తుతున్నారు. వీరందరికి బెడ్లు, ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. గతంలో మునుపెన్నడూ లేని విధంగా దేశంలో హృదయ విదారకర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

క్లిష్ట పరిస్ధితుల్లో ప్రపంచానికి అండగా నిలిచిన భారతదేశం ఇప్పుడు సాయం కోసం ఎదురుచూస్తోంది. సెకండ్ వేవ్ ప్రభావం దేశంలోని అన్ని రంగాలపై ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా శుభకార్యాలు పెట్టుకున్న వారు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. 

తాజాగా కేరళలో ఆదివారం ఆసక్తికర సంఘటన జరిగింది. కోవిడ్‌ వార్డే పెళ్లి మండపం.. పీపీఈ కిట్లే పట్టు వస్త్రాలయ్యాయి. అలప్పుజ జిల్లాలో మెడికల్ కాలేజీ ఆసుపత్రిలోని కోవిడ్‌ వార్డులో ఘనంగా వివాహం జరిగింది. కైనకారి ప్రాంతానికి చెందిన శరత్ మోన్, అభిరామి ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ తమ బంధాన్ని పెళ్లి పీటలపైకి తీసుకెళ్లాలని భావించారు. 

Also Read:లేకలేక ఆడపిల్ల పుట్టిందని ... హెలికాఫ్టర్‌లో అత్తవారింటికి, వీడియో వైరల్

ఎవరి కుటుంబాలను వారు పెళ్లికి ఒప్పించి, వివాహానికి ముహుర్తాలు పెట్టుకున్నారు. అంతలోనే కరోనా వైరస్‌ విజృంభించడంతో పెళ్లికి ఆటంకం ఏర్పడింది. వివాహానికి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్న శరత్ కరోనా బారిన పడ్డాడు.

అతనితో పాటు తల్లికి కూడా పాజిటివ్‌గా తేలింది. దీంతో వారిద్దరూ అలప్పుజ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలోని కోవిడ్ వార్డులో చేరారు. ఏం జరిగినా సరే తమ పెళ్లి మాత్రం ఆగడానికి వీల్లేదని అభిరామి పట్టుబట్టింది. దీంతో ఇరు కుటుంబాల వారు ఏప్రిల్ 25న వీరి వివాహం జరపాలని నిర్ణయించారు.

ముందుగా జిల్లా కలెక్టర్, ఇతర అధికారుల అనుమతి కూడా తీసుకోవడంతో అలప్పుజా శరత్ చికిత్స పొందుతున్న కోవిడ్‌ వార్డులోనే వీరి పెళ్లి జరిగింది. పట్టుబట్టలు ధరించాల్సిన వధూవరులిద్దరూ పీపీఈ కీట్లు వేసుకుని వివాహం చేసుకున్నారు. తోటి రోగులు కూడా కొత్త జంటను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.