కూతురు వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకుందని ఆ తల్లిదండ్రులు ఉడికిపోయారు. తమ పరువు తీసిందంటూ ఆమె తోడబుట్టినవాడే హత్యకు పథకం పన్నాడు. ముగ్గురూ కలిసి అతి దారుణంగా హతమార్చారు.
హర్యానా : సొంత కూతురు అనే కనికరం కూడా లేకుండా.. తల్లితండ్రి దారుణానికి ఒడిగట్టారు. దీనికి ఆమె తోడబుట్టిన అన్న కూడా తోడయ్యాడు. తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందన్న కోపంతో.. తల్లి, తండ్రి, అన్న కలిసి ఆ యువతిని అతి దారుణంగా హతమార్చారు. ఆ తరువాత మృతదేహాన్ని కారులో వేసుకుని తీసుకెళ్లి, నిర్మానుష్య ప్రాంతంలో దహనం చేశారు. కూతురు ఇంటికి వచ్చి మరి ఈ దారుణానికి పాల్పడ్డారు.
ఆ సమయంలో ఇంట్లో కూతురి భర్త లేకపోవడంతో వీరికి అడ్డు చెప్పేవారు లేకపోయారు. దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే… భర్త తన భార్య కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అత్తామామల మీద అనుమానం ఉన్నట్లుగా పేర్కొన్నాడు. దీంతో కేసు విచారించిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిసాయి.
బాత్రుంలో బంధించి మూగ, చెవిటి మహిళపై అత్యాచారం.. ఎదురింటి యువకుడి దారుణం...
అతని భార్యను కన్న తల్లిదండ్రులు, తోడబుట్టిన వాడే అతి కిరాతకంగా పరువు హత్యకు పాల్పడ్డారని తేలింది. ఆగస్టు 17న ఉదయం 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. అంజలి (22) అనే యువతి, సందీప్ అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరి కులాలు వేరు కావడంతో తల్లిదండ్రులు దీనికి ఒప్పుకోలేదు. దీంతో వీరిద్దరూ కుటుంబాల ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నారు.
ఆ తర్వాత తమ ప్రాణాలకు హాని ఉందని చెప్పి.. సొంతగ్రామంనుంచి వెళ్ళిపోయి గుర్గావ్ లో ఉంటున్నారు. ఆగస్టు 17వ తేదీ ఉదయం అంజలి తల్లిదండ్రి, అన్న.. గురుగ్రామ్ లోని సెక్టార్ 102లోని రాఫ్ అల్యాస్ లో 201నెం. ఫ్లాట్ లో ఉంటున్న అంజలి ఇంటికి వచ్చారు. ఆ సమయంలో సందీప్ తన సోదరి ఇంటికి వెళ్ళాడు. తీజ్ పండగ సందర్భంగా సోదరికి మిఠాయిలు ఇచ్చి వస్తానని వెళ్ళాడు.
దీంతో ఇంట్లో అంజలి ఒంటరిగా ఉంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన తండ్రి కుల్దీప్, తల్లి రింకీ, సోదరుడు కునాల్.. ఒక్కసారిగా అంజలి మీద దాడి చేశారు. కాళ్లు చేతులు నొక్కిపెట్టి గొంతు పిసికి చంపేశారు. ఆ తర్వాత అంజలి మృతదేహాన్ని తాము తీసుకువచ్చిన కారులో వేసుకొని తమ గ్రామమైన సురౌతికి వెళ్లారు.
ఆ తరువాత ఒక నిర్మానుష్య ప్రదేశంలో అంజలి మృతదేహానికి అంతిమ సంస్కారాలు చేసి, దహనం చేశారు. ఈ విషయం గ్రామస్తులకు తెలియదు. ఆ తరువాత అంజలి చనిపోయిన విషయం వెలుగులోకి రావడంతో.. గ్రామానికి చెందిన ఓ యువకుడు అంజలి భర్తకు ఫోన్ చేసి తెలిపాడు. అప్పటికే భార్య కనిపించడం లేదంటూ వెతుకుతున్న సందీప్.. వెంటనే పోలీసులకు భార్య తల్లిదండ్రులు, సోదరుడి మీద హత్య ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిందితులను అరెస్టు చేసి విచారించారు.
పోలీసుల విచారణలో నిందితులు నేరం ఒప్పుకున్నారు. వరుణ్ దహియా అనే ఉన్నతాధికారి మాట్లాడుతూ.. ఇది పరువు హత్యగా తేల్చారు. అంజలి జాట్ కుటుంబానికి చెందిన మహిళ కాగా, సందీప్ బ్రాహ్మణుడు. 2022 డిసెంబర్ 19న వీరిద్దరూ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అప్పటినుంచి కుటుంబాల నుంచి ప్రమాదం వాటిల్లుతుందని అనుమానించి గురుగ్రామ్ లో ఉంటున్నారు.
అంజలి ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఆమె కుటుంబానికి ఏ మాత్రం ఇష్టం లేదు. అయితే, ఇక్కడ గుర్తించాల్సిన మరో విషయం ఏంటంటే అంజలి అన్న కునాల్ కూడా ప్రేమ వివాహమే చేసుకున్నాడు. సోదరి ప్రేమ వివాహం తర్వాత ఆమెను ఎలాగైనా హతమార్చాలని పథకం వేసిన కునాల్.. సోదరి భర్తతో పరిచయం పెంచుకొని వారుంటున్న అపార్ట్మెంట్లోనే ఓ ఫ్లాట్లో అద్దెకు దిగాడు.
అలా వారి కదలికలపై నిఘా పెట్టిన కునాల్.. సందీప్ ఆగస్టు 17వ తేదీన తన సోదరీ ఇంటికి వెళ్లింది గమనించి.. తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే వారు తమ గ్రామం నుంచి అక్కడికి చేరుకోగా వారితో కలిసి కునాల్ అంజలిని హతమార్చాడు. నిందితుడైన అంజలి తండ్రి ఓ ఫైవ్ స్టార్ హోటల్లో పనిచేస్తున్నాడు. వీరందరిపై కేసులు నమోదయాయని.. దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.
