జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన కమాండర్ హతమయ్యాడు. దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా రిషిపోరా గ్రామం కప్రాన్ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.
జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన కమాండర్ హతమయ్యాడు. దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా రిషిపోరా గ్రామం కప్రాన్ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. గత రాత్రి ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు సైనికులు, ఒక పౌరుడుగాయపడ్డారని పోలీసులు శనివారం వెల్లడించారు. వారికి ఆస్పత్రికి తరలించినట్టుగా చెప్పారు. ‘‘నిషిద్ధ హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన టెర్రరిస్ట్ కమాండర్ నిసార్ ఖాండే హతమయ్యాడు. ఘటన స్థలం నుంచి ఒక ఏకే 47 రైఫిల్‌తో సహా పేలుడు పదార్థాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్ పురోగతిలో ఉంది’’ అని కాశ్మీర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు.
అనంత్‌నాగ్‌లోని రిషిపోరా ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ఎన్‌కౌంటర్ ప్రారంభమైందని పోలీసు అధికార ప్రతినిధి తెలిపారు. ఉగ్రవాదులు జరిపిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు సైనికులు, ఒక పౌరుడు గాయపడ్డారని చెప్పారు. ‘‘గాయపడిన వారందరినీ వెంటనే చికిత్స కోసం శ్రీనగర్ 92 బేస్ హాస్పిటల్‌కు తరలించారు. వారి పరిస్థితి నిలకడగా ఉంది’’ అని పోలీసు అధికార ప్రతినిధి చెప్పారు.
ఇక, .రిషిపొరా గ్రామంలో ఉగ్రవాదుల ఉనికి గురించి సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్మీ సంయుక్త బృందం కార్డన్ సెర్చ్ ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. ఉగ్రవాదులు ఉన్నట్టుగా అనమానించిన స్థలాన్ని చుట్టుముట్టడంతో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలు మధ్య కాల్పులు ప్రారంభమయ్యాయి. ఇంకా ఆ ప్రాంతంలో భద్రత బలగాల గాలింపు కొనసాగుతుంది.
