Asianet News TeluguAsianet News Telugu

20 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకు.. సన్యాసిగా మారి తల్లినే భిక్ష అడిగాడు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..

22 ఏళ్ల కిందట తల్లిదండ్రుల నుంచి తప్పిపోయిన కుమారుడు తరువాతి కాలంలో సన్యాసిగా మారాడు. అనుకోకుండా తల్లిని కలిశాడు. ఓ విచారమైన పాట పాడుతూ తల్లినే భిక్ష అభ్యర్థించాడు. దీంతో ఆ తల్లి కన్నీరుమున్నీరైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

His son went missing 20 years ago. He became a monk and asked his mother for alms. The video is in tears..ISR
Author
First Published Feb 8, 2024, 11:49 AM IST | Last Updated Feb 8, 2024, 11:49 AM IST

రెండు దశాబ్దాల తర్వాత అదృశ్యమైన కుమారుడు తిరిగి వచ్చి తల్లినే భిక్ష అడిగిన భావోద్వేగ సంఘటన ఇది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జిల్లాలో ఓ గ్రామంలో చోటు చేసుకున్న ఈ దృష్యాలు అందరినీ కదిలిస్తున్నాయి. కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఆ గ్రామానికి చెందిన ఓ బాలుడు 20 సంవత్సరాల కిందట తప్పిపోయాడు. అప్పుడు ఆ బాలుడి వయస్సు 11 సంవత్సరాలు మాత్రమే. తరువాత ఆ బాలుడు సన్యాసిగా మారి ఆ గ్రామానికి వెతుక్కుంటూ వచ్చాడు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో తల్లీ కొడుకులు కలిసిన దృష్యాలను భావోద్వేగ రీతిలో చూపించారు. అందులో ఓ సన్యాసి సాంప్రదాయ దుస్తులను ధరించాడు. పురాతన మూడు తీగల సంగీత వాయిద్యమైన సారంగిని వాయిస్తూ,  విచారకరమైన రాగాలు పాడుతూ తల్లిని భిక్ష వేడుకుంటున్నాడు. అది వింటూ ఆ తల్లి, పక్కన్న ఉన్న అందరూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

ప్రముఖ జానపద కథల్లో ప్రధాన పాత్ర అయిన భర్తరి రాజు గురించి ఇలాంటి కథతో సన్యాసులు జానపద పాటలు పాడతారు. భారతరి రాజు సంపన్న రాజ్యాన్ని విడిచి ఎలా సన్యాసి అయ్యాడు అనేది ఆ కథ సారాంశం. 

ఇదిలా ఉండగా.. ప్రస్తుత సందర్భంలో సన్యాసిగా మారిన పింకూ 2002లో తన 11 ఏళ్ల వయస్సులో ఇంటి నుంచి బయటకు వచ్చాడు. గోళీలు ఆడుతున్నాడని తండ్రి రతీపాల్ సింగ్ మందలించాడు. తల్లి కూడా కుమారుడిని తిట్టింది. దీంతో పింకూ ఇంటి నుంచి బయటకు బయలుదేరాడు. రెండు దశాబ్దాల పాటు ఇంటికి దూరంగా ఉన్నాడు. 

అయితే గత వారం అమేథీలోని ఖరౌలి గ్రామానికి సన్యాసిగా మారిన పింకూ వచ్చాడు. ఆ గ్రామస్తులు వెంటనే ఢిల్లీలో ఉంటున్న అతడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పింకూ శరీరంపై ఉన్న గాయాలను బట్టి తల్లిదండ్రులు తమ కుమారుడే అని గుర్తించారు. దీంతో అందరూ భావోద్వేగానికి గురయ్యారు. అయితే పింకూ తల్లి దండ్రులతో కొంత సమయం మాత్రమే గడిపాడు. తల్లి నుంచి భిక్ష తీసుకొని వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఎంత వేడుకున్నప్పటికీ.. పింకూ మరో సారి తల్లిదండ్రులను విడిచి వెళ్లిపోయాడు. కాగా.. పింకూ తల్లిని భిక్ష అడుగుతూ పాడిన పాట, తల్లి భావోద్వేగానికి గురైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios