Hippocratic oath: వైద్య వృత్తిని స్వీకరించేవారు తాము సమాజానికి అంకితమవుతామని చేసే హిపోక్రటిక్ ప్రమాణం మారనుంది. దీని స్థానంలో భారతీయ పురాతన ఆయుర్వేద వైద్యుడు చరకుడు రాసిన 'చరక్ ప్రమాణాన్ని' తీసుకోనున్నారు.
Hippocratic oath: చాలా సంవత్సరాలుగా కొనసాగుతున్న వైద్యుల ప్రమాణం మారనుంది. హిపోక్రాటిక్ ప్రమాణం (వైద్య వృత్తిని స్వీకరించే ముందు చేస్తారు) స్థానంలో మరో కొత్త దానిని తీసుకురానున్నామని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎండీసీ) పేర్కొంది. హిపోక్రటిక్ ప్రమాణాన్ని 'చరక్ శపథ్' గా మార్చనున్నట్లు భారతదేశ అత్యున్నత వైద్య విద్యా నియంత్రణ సంస్థ నేషనల్ మెడికల్ కమిషన్ (National Medical Commission) ప్రకటించింది. హిప్పోక్రటిక్ ప్రమాణం అనేది గ్రీకు వైద్య గ్రంథాల నుంచి స్వీకరించిన నీతి ప్రమాణం. కొత్త అకడమిక్ సెషన్ ఫిబ్రవరి 14 నుండి ప్రారంభమవుతుంది . నేషనల్ మెడికల్ కమిషన్ అండర్ గ్రాడ్యుయేట్ బోర్డు గత వారం కళాశాలల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ప్రాంతీయ భాషలలో కూడా ప్రమాణం చేయవచ్చని నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
హిపోక్రటిక్ ప్రమాణం అంటే ఏమిటి?
వైద్య వృత్తిని స్వీకరించే వారు తాము రోగికి అవసరమైన వైద్యాన్ని నిజాయితీగా చేస్తామనీ, ఉపాధ్యాయులకు గౌరవం ఇస్తామనీ, రోగికి సంబంధించిన రహస్యాలను బహిరంగ పరచబోమనీ, మా జీవితాలను మానవ విలువల కోసం ధారపోస్తామని ప్రమాణం చేస్తారు. దీనికి సంబంధించిన ప్రమాణాన్ని గ్రీక్ పురాతన వైద్యుడు హిప్పోక్రట్స్ చే రాయబడిన గ్రంథం నుంచి తీసుకున్నారు. హిపోక్రటిక్ వైద్య ప్రమాణం ఇలా ఉంటుంది.. ‘ఐ సోలేమ్‌లి ప్లెడ్జ్ టు కాన్సంట్రేట్ మై లైఫ్ టు ది సర్వీసు ఆఫ్ హ్యుమానిటీ. ఐ విల్ గివ్ టుమై టీచర్స్ ద రెస్పెక్ట్ అండ్ గ్రాట్యుట్యూడ్ ఈజ్ దెయిర్ డ్యూ. ఐ విల్ రెస్పెక్ట్ ద సీక్రెట్స్ దట్ ఆర్ కనఫైండ్ ఇన మి. ఈవెన్ ఆఫ్టర్ ద పేషెంట్ హ్యాజ్ డైడ్’ అని ప్రమాణం చేస్తారు.
హిపోక్రటిక్ ప్రమాణం స్థానంలో చరక శపథ్.. !
ఇప్పటివరకు వైద్య వృత్తిని స్వీకరించడానికి ముందుగా గ్రీక్ పురాతన వైద్యుడు హిప్పోక్రట్స్ చే రాయబడిన గ్రంథం నుంచి హిపోక్రటిక్ ప్రమాణం తీసుకున్నారు. దీనిని ప్రపంచ వైద్య సంఘం (The World Medical Association)లో సభ్యదేశాలు అన్ని ఇదే ప్రమాణం వైద్యులతో చేయిస్తున్నాయి. హిపోక్రట్స్ ప్రమాణం స్థానంలో చరక శపథ్ ను తీసుకురానున్నట్టు ఇండియన్ నేషనల్ మెడికల్ కమిషన్ ప్రకటించింది. ఈ కొత్త ప్రమాణం మహర్షి చరకకు సంబంధించినది. భారతీయ ఆయుర్వేద నిపుణులలో ఒకరైన చరకుడు రాసిన పురాతన భారతీయ వైద్య సమగ్ర గ్రంథం చరక సంహిత లో రాయబడిన దానిని తీసుకోనున్నారు.
చరక ప్రమాణం తీసుకోవడమే కాకుండా, MBBS ఫ్రెషర్‌లందరూ రోజుకు ఒక గంట పాటు 10 రోజుల యోగా శిక్షణను పొందవలసి ఉంటుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. సెయింట్ జాన్స్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ డీన్ డాక్టర్ జార్జ్ డిసౌజా మాట్లాడుతూ.. చరక ప్రమాణానికి మారడం గురించి ఎన్ఎంసీ కళాశాలలకు తెలియజేసిందని అన్నారు. అయితే, ప్రమాణాన్ని ఇంకా ప్రచురించలేదని చెప్పారు.
"ఆధునిక వైద్యానికి 200 ఏళ్ల చరిత్ర ఉంది. భారతదేశానికి వైద్యరంగంలో గొప్ప గతం ఉండగా, గ్రీకు వైద్యుడి పేరుతో వైద్యుల ప్రమాణ స్వీకారం ఎందుకు కొనసాగించాలి? ఇది మా అనేక సమావేశాల్లో చర్చించబడింది. మహర్షి చరక పేరుతో ప్రమాణం చేయడం గర్వించదగ్గ విషయం" అని కౌన్సిల్ సభ్యుల్లో ఒకరు పేర్కొన్నారు.