దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో విద్యార్ధులపై దాడికి పాల్పడింది తామేనని హిందూ రక్షాదళ్ సంచలన ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం హిందూ రక్షాదళ్ అధినేత భూమేంద్ర తోమర్ అలియాస్ పింకీ చౌధరీ సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేసినట్లు తెలుస్తోంది.

Also Read:26/11 గుర్తుకొచ్చేలా చేసింది : జేఎన్‌యూ ఘటనను ఖండించిన ఉద్ధవ్ థాక్రే

‘‘జేఎన్‌యూ కమ్యూనిస్టులకు హబ్‌గా మారింది. మన మతాన్ని, దేశాన్ని వారు కించపరుస్తున్నారు.. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఇలాంటి వాటిని తాము ఎట్టి పరిస్ధితుల్లోనూ సహించబోమని పింకీ ఆ వీడియోలో అన్నట్లుగా తెలుస్తోంది.

భవిష్యత్‌లో మరే యూనివర్సిటీలోనైనా ఇలాంటి దేశ వ్యతిరేక కార్యకలాపాలు జరిగితే అక్కడ కూడా ఇలాంటి దాడులే జరుగుతాయని భూపేంద్ర హెచ్చరించారు. ఆ కొద్దిసేపటి తర్వాత ఇదే విషయాన్ని ఆయన జాతీయ మీడియాకు తెలిపినట్లుగా తెలుస్తోంది.

Also Read:జేఎన్‌యూలో దాడి: లెప్టినెంట్ గవర్నర్‌‌తో వీసీ భేటీ, అమిత్‌ షా ఫోన్

మరోవైపు పింకీ చౌదరి చేసిన ప్రకటనపై దర్యాప్తు చేస్తామని ఢిల్లీ పోలీస్ వర్గాలు తెలిపాయి. వర్సిటీ క్యాంపస్‌లోని వీడియో ఫుటేజ్, ఫేస్ రికగ్నిషన్ వంటి సాధనాల సాయంతో ముసుగులు ధరించిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఇక జేఎన్‌యూలో ఆదివారం జరిగిన దాడికి సంబంధించి బీజేపీ అనుబంధ ఏబీవీపీకి క్లీచ్ చిట్ ఇస్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి.