పాకిస్తాన్ లో హిందువులు ఎన్నిబాధలు అనుభవిస్తారో వేరుగా చెప్పనక్కరలేదు. అన్నిటికంటే ముఖ్యంగా ఆడవారిపై జరిగే ఆకృత్యాలు వర్ణనాతీతం. మహిళల మానప్రాణాలు కాపాడలేకపోతున్నామని ఎందరో తండ్రులు, అన్నలు,భర్తలు జీవచ్ఛవాలుగా బ్రతుకుతున్నారు. 

పాకిస్తాన్ నుంచి శరణార్థిగా వచ్చి నగరంలో జీవనం సాగిస్తున్న బసంత్ లాల్ ను పలకరిస్తే తన హృదయ విదారకమైన కథను నెమరువేసుకుంటూ, పాకిస్తాన్ లో హిందువులు ఎందుకు బ్రతకలేకపోతున్నారో వివరించాడు. అక్కడ పోలీసు వారు కూడా హిందువులను పట్టించుకోరని...మతోన్మాద శక్తులకు పెద్దపీట వేస్తారని, వారి కనుసన్నల్లోనే వారుసైతం నడుచుకుంటారని బసంత్ లాల్ చెప్పాడు. 

also read  అక్కడ బలవంతపు మతమార్పిడులు సర్వసాధారణం...

2013లో కుటుంబంతో సహా బసంత్ లాల్ ఇండియా వచ్చాడు. అక్కడ తమ ఆడవాళ్లను రక్షించుకోలేని దయనీయస్థితిలో ఎం చేయాలో పాలుపోక భారతదేశం వచ్చానని అన్నాడు. అక్కడ ఉన్న మతోన్మాద శక్తులు హిందూ మహిళలపై అనేక దాడులు చేస్తారని బసంత్ లాల్ అంటున్నాడు. 

పోలీసుల దగ్గరకు  వెళ్లి గోడు వెళ్లబోసుకుందాం అంటే గోడు వినడానికి కూడా ఎవ్వరు సిద్ధంగా ఉండరు. కనీసం పోలీస్ స్టేషన్ కి వెళ్తే అక్కడ తాము హిందువులం కాబట్టి పోలీసువారు తమ కేసులను కూడా రిజిస్టర్ చేయరని వాపోయాడు. మతోన్మాద శక్తుల గుప్పిట్లో పాకిస్తాన్ వ్యవస్థ పనిచేస్తుందని ఆవేదన వ్యక్తం చేసాడు. 

అక్కడ తమకు భూములున్నాయని. కానీ ఆ భూముల్లో పండించిన పంటను అమ్ముకోబోతే ఎవరు కొనరని వాపోయాడు. ఆ పంటలను ఒకవేళ ఎవరైనా కొన్నప్పటికీ కూడా తాము హిందువులం కాబట్టి ధర చాలా తక్కువగా ఇస్తారని వాపోయాడు. తాము తమ ఆడవాళ్లను ఇంట్లో నుంచి బయటకు వెళ్లనిచ్చేవాళ్ళం కాదని తన దయనీయమైన పరిస్థితిని చెప్పుకొచ్చాడు.

also read తమిళనాడులో.. తెలుగు టీచర్ అనుమానాస్పద మృతి

తమ మహిళలపై మతోన్మాద శక్తులు ఎప్పుడు ఒక కన్నేసి ఉంచేవని, అందుకని వారు బయటకు వెళ్లాలంటే భయపడేవారని అశ్రునయనాలతో అప్పటి సంఘటనలను గుర్తుకు చేసుకున్నాడు. భారత ప్రభుత్వం ఇప్పుడు సవరణ చేసిన పౌరసత్వ చట్టం వల్ల తాము చాల ఆనందంగా ఉన్నామని చెప్పుకొచ్చాడు. తమ కష్టాలు ఇక గట్టెక్కినట్టే అని ఆనందం వ్యక్తం చేసాడు. ఇప్పుడు భారతదేశంలో ఒక హిందువుగా తాను గర్వంగా తలెత్తుకొని జీవించగలనని, అలా జీవించేందుకు తమకు ఆస్కారం కలిగిందని చెప్పుకొచ్చాడు. 

పౌరసత్వ సవరణ చట్టం ఎం చెబుతుంది...?
పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంకల నుంచి వచ్చిన క్రిస్టియన్, జైన్, బౌద్ధ,హిందూ, సిక్కు, పార్శి మతస్థులు మతపరమైన హింసకు గురై భారతదేశానికి శరణార్థులుగా వచ్చిన వారికి భారత పౌరసత్వం కల్పించడం కోసం ఈ చట్టాన్ని రూపొందించారు. 2014 డిసెంబర్ 31లోగా భారత్‌లోకి శరణార్థులుగా వచ్చిన వారికి మాత్రమే భారత పౌరసత్వం లభిస్తుంది. గతంలో భారత్‌లో 11 ఏళ్లుగా నివాసం ఉంటున్న వారికే భారత పౌరసత్వం ఇవ్వగా.. ఇప్పుడు దాన్ని ఐదేళ్లకు తగ్గించారు.