తెలుగు టీచర్...  తమిళనాడులో అనుమానాస్పద స్ధితిలో మృతి చెందారు.  కాలేజీలోని తరగతి గదిలో ఫ్యాన్ కి ఉరివేసుకొని చనిపోవడం గమనార్హం. అయితే... ఆమె మణికట్టు భాగంలో కత్తిగాట్టు కూడా ఉన్నాయి. దీంతో... నిజంగా ఆమెది ఆత్మహత్యేనా.. లేక ఎవరైనా హత్య చేసి.. ఆత్మహత్యలా చిత్రీకరించారా అనే విషయం తెలియడం లేదు. 

పూర్తి వివరాల్లోకి వెళితే... తిరువళ్లూరు జిల్లా కారంబాక్కం తాలుకా ఎల్లయమ్మన్ ఆలయం వీధికి చెందిన హరి శాంతి(32) మద్రాసు వర్సీటీ తెలుగు విభాగంలో ఎంఏ, ఎంఫిల్, పీహెచ్ డీ పూర్తి చేశారు. పేద తెలుగు కుటుంబానికి చెందిన ఆమె స్థానికంగా ఖాళీ సమయాల్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ చదువు పూర్తి చేసింది. గతంలో డీజీ వైష్టవ కళాశాలలో కొంత కాలం పనిచేశారు. 

ప్రస్తుతం పెరంబూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు టీచర్‌గా పనిచేస్తున్నారు.  ఈ పరిస్థితుల్లో బుధవారం ఉదయం డీజీ వైష్ణవ కళాశాల తెలుగు విభాగం తరగతి గదిలో ఆమె మృతదేహం ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించడం చర్చనీయాంశం అయింది.

ఆ కాలేజీలో ఉద్యోగం మానేసినప్పటికీ అప్పుడప్పుడు ఆమె వైష్ణవ కాలేజీకి వెళ్తుండేవారు. మంగళవారం కళాశాలకు వెళ్లిన హరిశాంతి తిరిగి బయటకు రాలేదు. బుధవారం ఉదయం కళాశాల మొదటి అంతస్తులోని తెలుగు విభాగం తరగతి గదిలో ఫ్యానుకు వేలాడుతూ కనిపించడంతో పారిశుద్ధ్య సిబ్బంది సెక్యూరిటీకి సమాచారం ఇచ్చారు. 

అరుంబాక్కం పోలీసులకు తెలపడంతో పులియాంతోపు డిప్యూటీ కమిషనర్‌ రాజేష్‌ ఖన్నా, అసిస్టెంట్‌ కమిషనర్‌ శ్రీనివాసులు, అరుంబాక్కం ఇన్‌స్పెక్టర్‌ శంకర్‌ నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగింది. మృతదేహాన్ని కిందకు దించి పరిశీలించగా ఆమె ఎడమ చేతి మణికట్టుకు కత్తి, బ్లేడుతో కోసినట్టుగా గాటు కనిపించింది. దీంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే... ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని స్థానికులు చెబుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.