మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఇళ్ల వద్ద వారి మద్ధతుదారులు ఆందోళనకు దిగారు. తమ నేతను సీఎం చేయాలంటూ వారి మద్ధతుదారులు నినాదాలు చేయడంతో పాటు ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. 

కర్ణాటకలో ముఖ్యమంత్రిని ఎంపిక చేయడం కాంగ్రెస్ హైకమాండ్‌కు పెద్ద టాస్క్‌గా మారింది. సాయంత్రం సీఎల్పీ సమావేశం జరగనున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఇళ్ల వద్ద హైడ్రామా నెలకొంది. తమ నేతను సీఎం చేయాలంటూ వారి మద్ధతుదారులు నినాదాలు చేయడంతో పాటు ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. అయితే తమకు విధేయులైన ఎమ్మెల్యేలతో సిద్ధరామయ్య , డీకే శివకుమార్‌లు విడివిడిగా భేటీ కావడం కన్నడ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

మరోవైపు.. కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బెంగళూరు నగరంలోని ఓ హోటల్‌లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎవరిని సీఎంగా ఎన్నుకోవాలనే అంశంపై చర్చిస్తున్నారు. ఇందుకోసం పరిశీలకులను నియమించింది ఏఐసీసీ. మాజీ కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే, జితేంద్ర సింగ్, దీపక్ బబారియాలు ఇప్పటికే బెంగళూరు చేరుకున్నారు. వీరంతా సీఎల్పీ సమావేశంలో పాల్గొని అధిష్టానానికి నివేదికను అందజేయనున్నారు. సీఎం ఎవరైతే బాగుంటున్న దానిపై ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకోవడంతో పాటు అవసరమైతే రహస్య ఓటింగ్ విధానం ద్వారా సీఎంను ఎంపిక చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది.

అంతకుముందు డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం నేపథ్యంలో శివకుమార్ ఆదివారం తుమకూరు జిల్లాలోని నోనవినకెరెకు వెళ్లారు. అక్కడ కడసిద్ధేశ్వర మఠానికి చేరుని ప్రత్యేక పూజలు చేశారు . అలాగే గంగాధరేశ్వర అజ్జయ్య, వృషభ దేశికేంద్ర మఠాధిపతి ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. అనంతరం డీకే మీడియాతో మాట్లాడుతూ.. సిద్ధరామయ్యతో తనకు విభేదాలు వున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.

Also Read: సిద్ధరామయ్యతో విభేదాలు.. తేల్చేసిన డీకే శివకుమార్, పార్టీ కోసం త్యాగాలు చేశానన్న కేపీసీసీ చీఫ్

ఆయనతో తనకు ఎలాంటి మనస్పర్థలు లేవని.. ఎన్నోసార్లు సిద్ధూకు అండగా నిలిచానని, పార్టీ కోసం ఎంతో త్యాగం చేశానని డీకే శివకుమార్ పేర్కొన్నారు. ఈ మఠం తనకు పవిత్రమైన స్థలమని.. తనపై ఈడీ, ఐటీ దాడులు జరిగినప్పుడు అజ్జయ్య స్వామిజీ భరోసానిచ్చారని ఆయన తెలిపారు. తాజా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 134 సీట్లు కావాలని తాను స్వామిజీని కోరానని.. కానీ అంతేకంటే ఎక్కువే వచ్చాయని డీకే శివకుమార్ వెల్లడించారు. 

మరోవైపు.. మాజీ సీఎం సిద్ధరామయ్య.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో భేటీ కావడం కన్నడ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. అయితే ఇది మర్యాదపూర్వక భేటీయేనని.. ఇందులో రాజకీయాలు చర్చించలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ స్పష్టం చేశారు. సీఎల్పీ సమావేశంలోనే సీఎం ఎవరన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు.