2015లో జరిగిన జాతీయస్థాయి షూటర్ సిప్పీ సిద్దూ హత్య కేసు కీలక మలుపు తిరిగింది. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సబీనా కూతురు కళ్యాణి సింగ్‌ను ఈ కేసులో సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. సిప్పీ సిద్దూ హంతకుడి వెంట కళ్యాణి సింగ్ ఉన్నట్టు సీబీఐ అనుమానిస్తున్నది.

న్యూఢిల్లీ: సుమారు ఏడేళ్ల తర్వాత జాతీయ స్థాయి షూటర్ సిప్పీ సిద్దూ హత్య కేసు ముందుకు సాగింది. అది కూడా భారీ ట్విస్టుతో పురోగతి సాధించింది. ఈ హత్య కేసులో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సబీనా కూతురు కళ్యాణి సింగ్‌ను సీబీఐ అరెస్టు చేసింది. ఈ కేసులో తొలి అరెస్టు న్యాయమూర్తి కూతురిదే కావడం గమనార్హం.

కళ్యాణి సింగ్ దీర్ఘకాలంగా అనుమానితురాలిగా ఉన్నది. షూటర్ సిప్పీ సిద్దూను షూట్ చేసిన మరో నిందితుడితో ఆ సమయంలో కళ్యాణి సింగ్ కూడా వెంట ఉన్నట్టుగా ఆమెపై అనుమానాలు ఉన్నాయి. ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం చెదిరిపోవడం కారణంగానే ఈ హత్య జరిగినట్టుగా తెలుస్తున్నది. తాజాగా, సీబీఐ కళ్యాణి సింగ్‌ను అరెస్టు చేసి ఆమెను దర్యాప్తు చేయడానికి నాలుగు రోజులు రిమాండ్‌లోకి తీసుకుంది.

సుఖ్‌మన్ ప్రీత్ సింగ్ అలియాస్ సిప్పీ సిద్దూ జాతీయ స్థాయి షూటర్. పంజాబ్ హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎస్ సిద్దూ మనవడు. కార్పొరేట్ న్యాయవాది కూడా. 35 ఏళ్ల సిప్పీ సిద్దూ మొహలిలో ఉండేవాడు. చండీగడ్‌లోని సెక్టార్ 27 పార్కులో 2015 సెప్టెంబర్ 20న విగతజీవై కనిపించాడు. ఆయన డెడ్ బాడీలోకి బుల్లెట్లు దిగి ఉన్నాయి.

కానీ, సిప్పీ సిద్దూ హత్య గురించి ఆధారాలేవీ కనిపించలేదు. 2016 అప్పటి పంజాబ్ గవర్నర్ ఈ కేసును సీబీఐకి అప్పగించారు. 2016 నుంచి కూడా హతుడి వెంట ఒక మహిళ ఉన్నదనే అనుమానాలు సీబీఐ సిబ్బందిలోనూ కలిగాయి. దీనిపై ప్రత్యేకంగా ఓ పేపర్ ప్రకటన కూడా ఇచ్చారు. సిప్పీ సిద్దూను హంతకుడి వెంట ఒక మహిళ ఉన్నట్టు తెలుస్తున్నదని, ఆమె అమాకురాలైతే స్వయంగా ముందుకు వచ్చి తమను కలిసే అవకాశాన్ని ఇస్తున్నట్టు పేర్కొంది. అలాగే, ఈ కేసుకు సంబంధించి ఏ చిన్న క్లూ ఇచ్చిన రూ. 5 లక్షల బహుమానం ఇస్తామని ప్రకటించింది. కానీ, ఎలాంటి క్లూ లభించలేదు.

2021లో ఈ కేసు మళ్లీ ముందుకు వచ్చిన వెంటనే రూ. 5 లక్షల రివార్డును సీబీఐ రూ. 10 లక్షలకు పెంచింది. ఆ మహిళ పాత్ర గురించి దర్యాప్తు చేయడానికి అనుమతి ఇవ్వాలని సీబీఐ 2020లోనే కోర్టు అనుమతి కోరింది. దీనిపై స్టేటస్ రిపోర్టు ఇవ్వడానికి నెల రోజుల గడువు కోరింది. తమ దర్యాప్తులో హంతకుడి వెంట నిందితురాలు కళ్యాణి సింగ్ ఉన్నట్టు తెలిసిందని సీబీఐ ప్రతినిధి వెల్లడించారు. అనంతరం ఆమెను ప్రశ్నించి అరెస్టు చేసినట్టు వివరించారు. ఆమెను సీబీఐ స్పెషల్ జడ్జీ సుఖ‌దేవ్ సింగ్ ముందు హాజరు పరిచారు. నాలుగు రోజుల కస్టడీలోకి తీసుకున్నారు.