వరదల్లో చిక్కుకున్న కొడగు జిల్లాలోని ప్రజలకు సాయం చేయడానికి టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి, సామాజిక కార్యకర్త సుధామూర్తి ముందుకొచ్చారు.
ఇన్ఫోసిస్ నారాయణమూర్తి భార్య సుధామూర్తి వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఆమె ఏం చేస్తున్నారనేగా మీ సందేహం.. ఇంకెందుకు ఆలస్యం చదివేయండి .. వరద బీభత్సానికి అతలాకుతలమైన కేరళను రక్షించడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందిస్తున్న సంగతి తెలిసిందే.
కాగా.. కేరళలలోని వరదల కారణంగా కేరళ-కర్ణాటక సరిహద్దులోని కొడగు జిల్లాను కూడా అతలాకుతలం చేశాయి. వరదల కారణంగా కొడగులో ఇప్పటివరకు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో వరదల్లో చిక్కుకున్న కొడగు జిల్లాలోని ప్రజలకు సాయం చేయడానికి టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి, సామాజిక కార్యకర్త సుధామూర్తి ముందుకొచ్చారు.
ఇన్ఫోసిస్ ఉద్యోగులతో కలిసి వరద బాధితులకు నిత్యావసరాలను అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆమె స్వయంగా సరుకులను ప్యాక్ చేయడంతోపాటు సంస్థ ఉద్యోగుల పనిని దగ్గరుండి పర్యవేక్షించారు. కాగా, సుధామూర్తి ఔదార్యాన్ని వీడియో తీసిన కేంద్రమంత్రి డీవీ సదానంద గౌడ ట్విటర్‌లో పోస్టు చేయడంతో వైరల్ అయింది. ఎంతోమంది సుధామూర్తి గొప్పమనసును మెచ్చుకున్నారు. ఈ వీడియోను ‘అమ్మ’అనే హ్యాష్‌టాగ్‌తో షేర్ చేసుకుంటున్నారు.
