Heavy rains: భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో గుజ‌రాత్ లోని 27 కు పైగా రాష్ట్ర ర‌హ‌దారులు మూత‌ప‌డ్డాయి. అలాగే, 8 జిల్లాల్లో రెడ్ అల‌ర్ట్ కొన‌సాగుతోంది. ముంపు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, రాష్ట్ర విపత్తు నిర్వహణ టీమ్ లు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.   

Heavy rains in Gujarat: దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. రుతుప‌వ‌నాలు చురుగ్గా క‌దులుతుండ‌టంతో రానున్న రోజుల్లోనూ ఇదే ప‌రిస్థితి ఉంటుంద‌ని వాతావ‌ర‌ణ అధికారులు పేర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని హెచ్చ‌రిస్తున్నారు. గుజార‌త్ లో వారం నుంచి కురుస్తున్న భారీ వ‌ర్షాల‌తో రాష్ట్రంలో ప‌రిస్థితులు దారుణంగా మారాయి. అనేక ప్రాంతాలు నీట‌మునిగాయి. ఆస్తి, ప్రాణ న‌ష్టం అధికంగానే జ‌రిగింద‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. గుజరాత్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా 43 మంది ప్రాణాలు కోల్పోయార‌ని అధికార గ‌ణాంకాలు పేర్కొంటున్నాయి. ఎనిమిది జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. అంతేకాకుండా, వరదల కారణంగా 27 స్టేట్ హైవే మార్గాలు కూడా మూసివేయబడ్డాయి.

గుజరాత్ (Gujarat) భారీ వ‌ర్షాల‌కు సంబంధించిన తాజా వివ‌రాలు ఇలా ఉన్నాయి.. 

  • రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఇప్ప‌టికీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గుజరాత్ లోని ఎనిమిది జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. 
  • భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించిన ప్రాంతాల్లో అజునాగర్, గిర్, భావనగర్, వల్సాద్, సూరత్, తాపీ, డాంగ్, నవ్‌సారిలున్నాయి. 
  • ఆయా ప్రాంతాల్లో ఇప్ప‌టికే పెద్ద‌మొత్తంలో వ‌ర‌ద నీరు ముంచెత్తింది. నివాసితులు సురక్షితమైన ప్రదేశానికి వెళ్లేందుకు మోకాళ్ల లోతు నీటిలో క‌దులుతున్న దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.
  • ఈ ప్రాంతాల్లోని రెండు డ్యామ్‌లలో నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో నవ్‌సారి చుట్టుపక్కల నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. అంతేకాకుండా, వీలైనంత ఎక్కువ మంది పౌరులను రక్షించడానికి తీర రక్షక దళం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. 
  • ప‌రిస్థితులు మ‌రింత దారుణంగా మారుతున్న క్ర‌మంలో అధికారులు 27 రాష్ట్ర రహదారుల రాక‌పోక‌ల‌ను బంద్ చేశారు. నవ్‌సారిలో వరదల కారణంగా 18,000 మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు.
  • వ‌ర‌ద‌ల కార‌ణంగా రాష్ట్రంలో పెద్ద‌మొత్తంలో ఆస్తి, ప్రాణ‌న‌ష్టం సంభ‌వించింది. ఈ ప్రాంతాల్లో సర్వే పూర్తయిన తర్వాత నష్టపోయిన వారందరికీ పరిహారం అందజేస్తామని గుజరాత్ ప్రభుత్వం పౌరులకు హామీ ఇచ్చింది. 
  • ఈ ఏడాదిలో ఇప్ప‌టివ‌ర‌కు సాధార‌ణం కంటే అధికంగానే వ‌ర్షాలు ప‌డ్డాయ‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. రుతుప‌వ‌నాల ప్రారంభం త‌ర్వాతి నుంచి ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రాష్ట్రంలో వర్షాల కారణంగా 43 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • దినేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(NDRF), తీర రక్షక దళం కావేరీ డ్యాం దగ్గర చిక్కుకున్న ఆరుగురిని ర‌క్షించి సుర‌క్షిత ప్రాంతానికి త‌ర‌లించింది. సాధారణ పౌరులను రక్షించడం కోసం ఎన్డీఆర్ఎఫ్‌, రాష్ట్ర విప‌త్తు నిర్వ‌హ‌ణ బృందాలు తమ ప్రాణాలను పణంగా పెట్టి రెస్క్యూ ఆపరేషన్ కొన‌సాగించిన వీడియోలో నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. 
  • మహారాష్ట్ర సమీపంలోని రెండు డ్యామ్‌లు పొంగిపొర్లుతున్నాయి. పూర్ణనదికి వరదలు రావడంతో వల్సాద్ జిల్లా, ఇతర పరిసర ప్రాంతాలలో భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రాంతంలోని ఇండ్లు ముంపున‌కు గుర‌య్యే ప్ర‌మాదం అధికంగా ఉండ‌టంతో ప్ర‌జ‌ల‌కు త‌మ విలువైన‌ వ‌స్తువుల‌ను తీసుకుని సుర‌క్షిత ప్రాంతాల‌కు వెళ్లే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.