Thiruvananthapuram: దక్షిణాది రాష్ట్రం కేరళలో వారం రోజులుగా విధ్వంసం సృష్టిస్తున్న భారీ రుతుపవనాల కారణంగా కేరళలో దాదాపు 19 మంది ప్రాణాలు కోల్పోయారు. 10,000 మందికి పైగా ప్రజలను సహాయ శిబిరాలకు తరలించారు. వర్షం తీవ్రత తగ్గుముఖం పట్టినప్పటికీ, రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ట్రాఫిక్ జామ్‌లతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎస్‌డీఎంఏ) ప్రకారం.. జూలై 8 వరకు దక్షిణాది రాష్ట్రంలో వర్షాలకు సంబంధించిన సంఘటనలలో మొత్తం 19 మంది ప్రాణాలు కోల్పోయారు.
Kerala weather: గత కొన్ని రోజులుగా కేరళలో రుతుపవనాలు తీవ్రరూపం దాల్చడంతో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఇడుక్కి జిల్లాలో రెడ్ అలర్ట్, ఆరు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వర్షాల కారణంగా 11 జిల్లాల్లో విద్యాసంస్థలు మూతపడ్డాయి. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కేరళకు వెళ్లాలని యోచిస్తున్న యూఏఈలోని ప్రవాస భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత సమయంలో కురిసిన భారీ వర్షాల కారణంగా వేలాది మంది ప్రజలు తమ ఇళ్లను ఖాళీ చేసి సహాయ శిబిరాలకు తరలించారు. ఈ సంఘటనలు రోజువారీ జనజీవనాన్ని గణనీయంగా దెబ్బతీశాయి. ఈ ఏడాది వర్షాలతో ఇప్పటివరకు 40 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఖలీజ్ టైమ్స్ కథనం ప్రకారం, ట్రావెల్ ఏజెన్సీని నడుపుతున్న యూఏఈ నివాసి రీనా ఫిలిప్.. "నేను తిరువనంతపురం కోసం టికెట్ బుక్ చేశాను, కానీ కేరళలో భారీ వర్షాల కారణంగా నేను అక్కడికి వెళ్ళాలనే ప్రణాళికను రద్దు చేసుకున్నాను" అని చెప్పారు. "నేను నా పర్యటనను సులభంగా వాయిదా వేసుకోగలను, అయితే, యూఏఈలో చాలా భారతీయ కుటుంబాలు తమ స్వదేశాన్ని సందర్శించాలని కోరుకుంటున్నాయని నాకు తెలుసు. డిస్కౌంట్లను పొందడానికి, సరసమైన ధరకు టిక్కెట్లను పొందడానికి ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్నారు" అని ఫిలిప్ చెప్పారు. అయితే, భారతీయ ప్రవాసులు తమ స్వస్థలాలను సందర్శించడానికి అసౌకర్యాన్ని ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. 2022లో మిడిల్ ఈస్ట్ నుంచి కాలికట్ విమానాశ్రయానికి వెళ్లే ఐదు విమానాలను కోజికోడ్ లోని ప్రతికూల వాతావరణం కారణంగా కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి దారి మళ్లించారు.
2018లో సంభవించిన భారీ వరదల కారణంగా 2022లో కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చాలా రోజులు మూసివేశారు. వరదల్లో విమానాశ్రయ మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి, 11-12.5 మిలియన్ దిర్హామ్స్ (రూ.24,74,25,860.00-28,11,65,750) నష్టం వాటిల్లింది. 2019 ఆగస్టులో భారీ వర్షాలు కురవడంతో విమానాశ్రయ కార్యకలాపాలను కొన్ని గంటల పాటు నిలిపివేయాల్సి వచ్చింది.
కాగా, కేరళలో కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా ప్రస్తుత సమాచారం ప్రకారం.. ఇప్పటివరకు సుమారు 1,100 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయనీ, అయితే ఎంత మేరకు విధ్వంసం జరిగిందనే దానిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. వర్షాల తీవ్రత తగ్గుముఖం పట్టడంతో అలప్పుజ, ఎర్నాకుళం, మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కన్నూర్, కాసరగోడ్ జిల్లాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అయితే తెల్లవారుజామున కొచ్చి, కోజికోడ్, హై రేంజ్ రీజియన్ ఇడుక్కిలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. ఆదివారం ఉదయం కోజికోడ్, కన్నూర్-తలస్సేరి మార్గాల్లోని జాతీయ రహదారులపై చెట్లు విరిగిపడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అదృష్టవశాత్తూ అగ్నిమాపక సిబ్బంది శిథిలాలను తొలగించిన తర్వాత ట్రాఫిక్ తిరిగి ప్రారంభమైంది. పతనంతిట్ట, తిరువళ్ల ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోవడంతో దైనందిన జీవితంపై తీవ్ర ప్రభావం పడింది.
