గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కేరళ అతలాకుతలం అవుతోంది. వర్షాలతో వాగులు, వంకలు ఏకమై నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. రోడ్లపై అడుగుల మేర నీరు ప్రవహిస్తూ ఉండటంతో రవాణా వ్యవస్థకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. భారీ వర్షాల దృష్ట్యా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. వర్షాల కారణంగా కేరళలో ఇప్పటి వరకు 18 మంది వరకు మరణించారు.

ఇడుక్కిలో కొండచరియలు విరిగిపడి 10 మంది, మలప్పురంలో ఇద్దరు, కన్నూర్‌లో ఇద్దరు, వైనాడ్‌లో ఒకరు చనిపోగా.. వరదల్లో చిక్కుకుని కొందరు గల్లంతయ్యారు. ఇడుక్కి జలాశయం నిండిపోవడంతో అధికారులు నీటిని కిందకు వదలుతున్నారు. దీంతో వరద నీరు కొచ్చి విమానాశ్రయంలోకి ప్రవేశించింది.

రన్‌వేపై కొన్ని అడుగుల మేర నీరు ప్రవహిస్తుండటంతో విమానయానశాఖ అప్రమత్తమైంది.. ఎయిర్‌పోర్ట్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. కొన్ని విమానాలను రద్దు చేసి.. మరికొన్నింటిని దారి మళ్లీస్తున్నారు. భారీ వర్షాలు, వరదలపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధికారులతో పరిస్ధితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి.. సహాయ, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.