ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో వర్షాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వరదలు పొంగి పొర్లుతున్నాయి. కాగా... మరో రెండు, మూడు రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దేశంలోని ఏడు రాష్ట్రాల్లో బుధవారం భారీవర్షాలు కురుస్తాయని ఢిల్లీలోని కేంద్ర వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. 

కోస్తా ఆంధ్రాతోపాటు తెలంగాణ, విదర్భ, గోవా, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, అండమాన్ నికోబార్ దీవుల్లో బుధవారం భారీవర్షాలు కురవవచ్చని వాతావరణశాఖ అధికారులు బుధవారం ఉదయం విడుదల చేసిన బులిటిన్ లో పేర్కొన్నారు. ఒడిశా, అండమాన్ నికోబార్ దీవుల్లోని సముద్ర తీర ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. రాగల వారం రోజుల పాటు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని వాతావరణశాఖ అధికారులు కోరారు.