రేపు, ఎల్లుండి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది వాతావరణ శాఖ . దక్షిణ కోస్తాంధ్ర పరిసరాల్లో 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.. మధ్య ఒడిశా మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది.

రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి.. ఉత్తర అండమాన్‌ సముద్రాన్ని ఆనుకుని తూర్పు మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడింది.

24 గంటల్లో అది వాయుగుండంగా మారి పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి, 11న ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిసా మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

తెలంగాణ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వీటి ప్రభావంతో రెండు రోజుల పాటూ భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. తీరం వెంబడి గంటకు 45-65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది.

తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు హైదరాబాద్‌లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది.

మధ్నాహ్నం నుంచి చల్లబడ్డ వాతావరణం సాయంత్రానికి ఒక్కసారిగా మారిపోయింది. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, కోఠి, ఉప్పల్, నాగోల్, సికింద్రాబాద్‌తో పాలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతుంది. దాదాపు గంటన్నర నుంచి వర్షం వస్తుండటంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి