Monsoon Deluge: దేశ రాజధాని సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో శనివారం, ఆదివారం ఉదయం భారీ వర్షాలు కురిశాయి. వర్షం కారణంగా రహదారులు జలమయం కావడంతో ప్రయాణికులు తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదేవిధంగా కేరళలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఉదయం వేళల్లో కుండపోత వర్షం కురవడంతో ట్రాఫిక్ స్తంభించి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హిమాచ‌ల్ ప్ర‌దేశాల్లో ఆక‌స్మిక వ‌ర‌ద‌లు సంభ‌వించాయి.  

Flash flood hits Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో ఆదివారం కురిసిన భారీ వర్షాలకు ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. సిమ్లాలోని కోట్ గఢ్ గ్రామంలో ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ అనంతరం బాధితులను శిథిలాల నుంచి బయటకు తీసి సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతులను అనిల్, కిరణ్, స్వప్నిల్ గా గుర్తించామనీ, వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించామని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని సిమ్లా ఎస్పీ సంజీవ్ కుమార్ గాంధీ తెలిపారు.

ఆదివారం తెల్లవారు జామున గ్రామఫు గ్రామం, చోటా ధర్రాలో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. హిమాచల్ ప్రదేశ్ స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ (హెచ్ పీఎస్ఈవోసీ) విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. ఏఈసీబీఆర్ ఓ94 ఆర్సీసీ, ఎన్ హెచ్ 505 (సుమ్డో కాజా-గ్రామ్ ఫూ) వెంబడి ఆక‌స్మిక వ‌ర‌ద‌లు, కొండచరియలు విరిగిపడిన సంఘటనను తెలియజేసింది. కొండచరియలు విరిగిపడటంతో రోడ్డుపై చిక్కుకున్న 30 మంది కళాశాల విద్యార్థులను సురక్షితంగా రక్షించినట్లు హెచ్ పీ ఎస్ ఈవోసీ తెలిపింది.

భావనా ట్రావెలర్స్ వాహ‌నంలో స్పితి నుంచి మనాలీ వెళ్తున్న కాలేజ్ స్టూడెంట్స్ బృందం.. రోడ్డు దిగ్బంధం కారణంగా వారు రోడ్డుపైనే చిక్కుకుపోయారు. మొత్తం 30 మంది కాలేజ్ విద్యార్థులను సురక్షితంగా విప‌త్తు నిర్వ‌హ‌ణ సిబ్బంది రక్షించారు. వాతావరణం అనుకూలించిన తర్వాత శిథిలాలను తొలగించేందుకు సిబ్బందిని, వనరులను వినియోగిస్తామని అధికారులు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ లోని కులు జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో ఇద్దరు మహిళలు శిథిలాల కింద సజీవ సమాధి కాగా, దుకాణాలు, వాహనాలు కొట్టుకుపోగా, మరికొన్ని చోట్ల ఆకస్మిక వరదలకు రహదారులు మూసుకుపోయాయి.

రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో రానున్న 48 గంటల పాటు రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్, మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను భారత వాతావరణ శాఖ శనివారం జారీ చేసింది. రాష్ట్రంలో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. చంబా, కాంగ్రా, కులు, మండి, ఉనా, హమీర్పూర్, బిలాస్పూర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రంలోని చాలా చోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది. సిమ్లా, సోలన్, సిర్మౌర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు ఐఎండీ హెచ్ పీ డిప్యూటీ డైరెక్టర్ బుయ్ లాల్ తెలిపారు. 

లాహౌల్, స్పితి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశామని, దీనికి సంబంధించిన ముందస్తు సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకున్నామని ఆయన పేర్కొన్నారు. కాగా, దేశ రాజధాని సహా ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో శనివారం, ఆదివారం ఉదయం భారీ వర్షాలు కురిశాయి. వర్షం కారణంగా రహదారులు జలమయం కావడంతో ప్రయాణికులు తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదేవిధంగా కేరళలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఉదయం వేళల్లో కుండపోత వర్షం కురవడంతో ట్రాఫిక్ స్తంభించి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. హిమాచ‌ల్ ప్ర‌దేశాల్లో ఆక‌స్మిక వ‌ర‌ద‌లు సంభ‌వించాయి. భారీ వ‌ర్షాలు కార‌ణంగా వంద‌ల మంది నిరాశ్ర‌యుల‌య్యారు.