అర్ధరాత్రి భారీ వర్షం.. జలమయమైన నాగ్ పూర్ సిటీ.. సహాయక చర్యల కోసం రంగంలోకి కేంద్ర బలగాలు
మహారాష్ట్రలోని నాగ్ పూర్ లో శుక్రవారం అర్థరాత్రి నుంచి ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. దీంతో సిటీలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. సహాయక చర్యలు చేపట్టేందుకు కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి.
మహారాష్ట్రలోని నాగ్ పూర్ సిటీలో శుక్రవారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో సిటీలోని అనేక ప్రాంతాలు వర్షపు నీటితో నిండిపోయాయి. రాత్రి నుంచి ఉదయం 5.30 గంటల వరకు నాగ్ పూర్ విమానాశ్రయంలో 106 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే పలు రోడ్లు, నివాస ప్రాంతాలు జలమయమైనట్లు అధికారులు తెలిపారు. ముందుజాగ్రత్త చర్యగా పాఠశాలలకు సెలవు ప్రకటించింది.
అయితే సిటీలో సహాయక చర్యలు చేపట్టేందుకు కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. ఇదే ప్రాంతానికి చెందిన ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నగరంలో వర్ష పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ‘‘ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అంబజారి సరస్సు పొంగిపొర్లుతోంది. దీని వల్ల చుట్టుపక్కల లోతట్టు ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితమవుతున్నాయి. నగరంలోని ఇతర ప్రాంతాలు కూడా ప్రభావితమయ్యాయి’’ అని దేవేంద్ర ఫడ్నవీస్ ఆఫీస్ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు పెట్టింది.
కాగా.. కొన్ని చోట్ల చిక్కుకుపోయిన వారిని రక్షించడానికి బహుళ బృందాలను వెంటనే యాక్టివేట్ చేయాలని డిప్యూటీ సీఎం నాగ్ పూర్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, పోలీస్ కమిషనర్ ను ఆదేశించినట్లు ఫడ్నవీస్ కార్యాలయం తెలిపింది. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళానికి చెందిన బృందాలను కూడా మోహరించినట్లు తెలిపింది. దీంతో స్థానిక యంత్రాంగం నగరంలోని పలు ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది.
ముఖ్యమైన పనుల కోసం తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని నాగ్ పూర్ మున్సిపల్ కార్పొరేషన్ సూచించింది. నాగ్ పూర్, భండారా, గోండియా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తీవ్రమైన లేదా మోస్తరు వర్షాలు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) నాగ్ పూర్ కేంద్రం తెలిపింది. ఈ ప్రాంతాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వార్ధా, చంద్రపూర్, భండారా, గోండియా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అమరావతి, యావత్మాల్, గడ్చిరోలి ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.