హత్యలు, భూ కబ్జాలు చేయడంలో అతను ఆరితేరి ఉన్నాడు. ఎన్నో సంవత్సరాలుగా పోలీసులకు చిక్కకుండా తన చేష్టలతో.. అనుచరుల బలగంతో బెంగళూరు ప్రజలను వణికిస్తూ వస్తున్నాడు. కాగా మోస్ట్ వాంటెడ్ క్రిమినలైన భరత్ తాజాగా పోలీసుల ఎదురు కాల్పుల్లో హతమయ్యాడు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read దారుణం.. రోజుల శిశువు నోట్లో మట్టి.. ఒంటిపై 20 కత్తిగాట్లు...

బెంగళూరు కి చెందిన పేరు మోసిన రౌడీ భరత్. గత కొద్ది సంవత్సరాలుగా పలు హత్యలు, దారి దోపిడీలు, భూ కబ్జాలు చేసి పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. కాగా.. సరిగ్గా 20 రోజుల క్రితం పీకలదాకా తాగి వాహనం నడుపుతూ వచ్చి.... సుబ్రమణ్యనగర సీఐ శివస్వామి, ఎస్‌ఐ శివరాజ్‌లను వాహనంతో ఢీకొట్టి పరారయ్యాడు. దీంతో.. పోలీసులు వెంబడించగా ఉత్తరప్రదేశ్ లో దొరికాడు.

తీరా చూస్తే.. అతను పలు నేరాల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా గుర్తించారు. అతనిని పోలీసులు అరెస్టు చేసిన విషయం భరత్ అనుచరులకు తెలిసిపోయింది. దీంతో అతనిని తప్పించే ప్రయత్నం చేశారు. గురువారం రాత్రి రెండు గంటల సమయంలో తుమకూరు రోడ్డులోని పీణ్య ఎస్‌ఆర్‌ఎస్‌ బస్‌స్టేషన్‌  భరత్‌ను తీసుకువస్తుండగా అనుచరులు పోలీసులు జీపును మారుతీ ఓమ్ని, జెన్‌ కారుతో ఢీకొట్టించారు. 

కొడవలి, లాంగ్‌ కత్తులతో పోలీసు జీపుపై దాడి చేసి పోలీసులపై రెండు రౌడ్లు కాల్పులు జరిపారు. సినిమా ఫక్కీలో పోలీసుల అదుపులో ఉన్న భరత్‌ను అనుచరులు విడిపించుకుని జెన్‌ కారులో పరారయ్యారు. దీంతో పోలీసులు నగరవ్యాప్తంగా పోలీసులను అలర్ట్‌ చేశారు. అన్ని ప్రాంతాల్లో నాకాబందీ నిర్వహించి బెంగళూరు నుంచి బయటకు వెళ్లే మార్గాల్లో మోహరించారు.  

ఈ క్రమంలో.. పోలీసులకు భరత్ అనుచరులకు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఓ సీఐ పొట్టలోకి బులెట్ దూసుకెళ్లింది. ఆ సమయంలో సీఐ బులెట్ ఫ్రూఫ్ జాకెట్ వేసుకోవడంతో స్వల్ప గాయంతో తప్పించుకున్నాడు. కాగా..  ఆత్మరక్షణలో భాగంగా పోలీసు అధికారి భరత్ పై కాల్పులు జరిపాడు.

బులెట్ గాయంతో కుప్పకూలిన భరత్ ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడని పోలీసులు చెప్పారు.