New Delhi: భారతదేశం అంతటా ఎండలు మండిపోతున్నాయి. వేడి పెరుగుతోంది. వడదెబ్బ బారినపడటంతో పాటు మరణాల సంభవించే అవకాశాలను ప్రస్తావిస్తూ భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు చేసింది. ఇదే సమయంలో చల్లదనం కోసం ప్రజలు తమ ఎయిర్ కండిషనర్లు సహా ఇతర పరికరాలను వాడటంతో విద్యుత్ వినియోగం పెరిగి గ్రిడ్ పరిమితులు దాటి పలు ప్రాంతాల్లో విద్యుత్తుకు అంతరాయం కలుగుతోంది.
Heat Is Surging Across India: ఎండలు మండిపోతున్నాయి. దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత అధికమవుతున్నదని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) నివేదికలు పేర్కొంటున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వేడి నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వడదెబ్బ బారినపడటంతో పాటు మరణాల సంభవించే అవకాశాలను ప్రస్తావిస్తూ ఐఎండీ హెచ్చరికలు చేసింది. ఇదే సమయంలో చల్లదనం కోసం ప్రజలు తమ ఎయిర్ కండిషనర్లు సహా ఇతర పరికరాలను వాడటంతో విద్యుత్ వినియోగం పెరిగి గ్రిడ్ పరిమితులు దాటి పలు ప్రాంతాల్లో విద్యుత్తుకు అంతరాయం కలుగుతోంది.
ఈ వారం ప్రారంభం నుంచి దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వడగాలుల తీవ్రత సైతం పెరుగుతోంది. కోట్లాది మంది ప్రజలు వేడి అలసట లేదా ప్రాణాంతక వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. ఒడిశాలోని బరిపడాలో సోమవారం గరిష్ఠ ఉష్ణోగ్రత 44 డిగ్రీలు దాటగా, పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 5 డిగ్రీలు అధికంగా నమోదైంది. హర్యానా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా సహా పలు ప్రాంతాలకు ఐఎండీ వడగాలుల హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణాది రాష్ట్రమైన తెలంగాణలోనూ ఎండల తీవ్రత పెరుగుతోంది. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను దాటాయి. సాధారణం కంటే వేడిగా ఉండే వేసవికి భారత్ సన్నద్ధమవుతోందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. 2022 లో ఉపఖండం తీవ్రమైన వడగాలులను ఎదుర్కొన్న తరువాత ఈ సంవత్సరం కూడా అదే స్థాయిలో ఎండలు మండిపోతున్నాయి. ఈ పరిస్థితులు ప్రపంచ గోధుమ సరఫరాను సైతం ప్రభావితం చేస్తున్నాయి.
వేడి, తేమతో కలిపినప్పుడు, ముఖ్యంగా ప్రమాదకరంగా లేదా ప్రాణాంతకంగా వాతావరణం మారుతుందని వాతావరణ నివేదికలు పేర్కొంటున్నాయి. దేశంలోని 1.4 బిలియన్ల జనాభాలో ఎక్కువ మంది ఆరుబయట పనిచేస్తారు, తరచుగా రక్షణ లేకుండా వారు ఇలాంటి ప్రమాదక ఎండల పరిస్థితుల్లో ఉంటారు. ప్రతి సంవత్సరం వేసవిలో చాలా మంది భవన నిర్మాణ కార్మికులు, హాకర్లు, రిక్షా పుల్లర్లు వేడిని తట్టుకునే రక్షణ లేక చాలా మంది మరణిస్తున్నారు. ప్రపంచంలో అత్యధికంగా ఉష్ణ సంబంధిత కార్మిక నష్టాలతో భారతదేశం బాధపడుతోందని రిపోర్టులు పేర్కొన్నాయి. ఆదివారం నాడు వడదెబ్బతో ముంబయిలో13 మంది ప్రాణాల కోల్పోయిన సంగతి తెలిసిందే.
ప్రజలు హైడ్రేటెడ్ గా ఉంటూ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. వేడికి గురికాకుండా ఉండాలని, తేలికపాటి, వదులుగా, కాటన్ దుస్తులు ధరించాలని, ఎండల నుంచి తలలను కవర్ చేసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. నీరు అధికంగా తీసుకోవాలనీ, వడదెబ్బ బారినపడకుండా జాగ్రత్తగా ఉండాలని అధికార యంత్రాంగాలు పేర్కొంటున్నాయి. ఎండల అధికం కావడం, తీవ్రమైన వేడి పరిస్థితుల నుండి పిల్లలను రక్షించడానికి పశ్చిమ బెంగాల్ ఈ వారం అన్ని విద్యాసంస్థలను మూసివేయాలని ఆదేశించింది. మరికొన్ని రాష్ట్రాల్లో పాఠశాలల సమయాన్ని కుదించారు.
